● జిల్లా నుంచి భారీగా ఆశావహులు ● తనకు అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి వినతి ● పురమల్ల, రాజేందర్‌రావు, పద్మాకర్‌రెడ్డి సైతం పోటీలో ● అధిష్టానం వద్ద ఎవరి ఫైరవీలు వారివే ● వరుస ఓటముల నేపథ్యంలో క్లిష్టంగా మారిన ఎంపిక
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి(డీసీసీ)కి రేసు షురూ అయింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అప్పుడే పోటీ మొదలైంది. జిల్లాలో ఎంతో కీలకమైన ఈ పోస్టు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక.. పార్టీ సంస్థాగతంగా బలోపేతం, నాయకత్వ ప్రక్షాళన తదితర అంశాలపై అధినాయకత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. గతానికి భిన్నంగా సాగనున్న ఈ ఎంపికపై జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వంలో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే అధిష్టానం వద్ద ఎవరి ఫైరవీలు వారు మొదలుపెట్టారు. గతంలోలా సిఫారసులకు తావు లేకుండా, నేతల పనితీరు, స్థానిక నేతల అభిప్రాయాల ఆధారంగా ఈ ఎంపిక జరగనుండటం ఆసక్తిరేపుతోంది.
పోటీ పడుతున్నది వీరే..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. ప్రస్తుతం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తనకు జిల్లా బాధ్యతలు ఇస్తే.. తానేంటో నిరూపించుకుంటానని ధీమాగా ఉన్నారు. అలాగే, పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు కూడా తనకు ఎలాగైనా డీసీసీ ఇవ్వాలని పట్టబడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరిన రాజేందర్‌రావు.. అది దక్కకపోవడంతో ఈసారి డీసీసీ విషయంలో పట్టుదలగా ఉన్నారు. వీరితోపాటు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్ కూడా డీసీసీ ప్రెసిడెంట్ ఆశావహుల జాబితాలో ఉన్నారని సమాచారం. ఢిల్లీలో ఈనెల 27న తెలంగాణ డీసీసీ అధ్యక్షులు, పట్ణణ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా పలువురు తమ మనసులో మాటను ఆయన ముందుంచే అవకాశాలు ఉన్నాయి.
స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
ఇప్పటికే కరీంనగర్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ, ఆపై మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. కరీంనగర్‌లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సీటును బీఆర్‌ఎస్ గెలవగా, కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీలో నైరాశ్యాన్ని మరింత పెంచింది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తరువాత అతిపెద్ద నగరం కావడంతో కరీంనగర్‌కు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. స్థానిక సంస్థలతోపాటు, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ పురపాలికలను చేజిక్కించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొనిపోయే బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం యోచిస్తోంది.
పురమల్ల శ్రీనివాస్
డీసీసీ రేస్ షురూ!
డీసీసీ రేస్ షురూ!
డీసీసీ రేస్ షురూ!
డీసీసీ రేస్ షురూ!