కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో న యా ట్యాక్స్ మొదలైంది. పాలకవర్గం ఉన్న సమయంలో కొన్ని డివిజన్‌లలో సీ (కార్పొరేటర్) ట్యాక్స్ వసూలు చేయడం తెలిసిందే. పాలకవర్గం పదవీకాలం ముగిసి స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలవడంతో న గరంలోని చాలా డివిజన్‌లలో నిర్మాణదారులు సీ ట్యాక్స్ గోల తప్పిందంటూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ప్రత్యేక పాలనలో పట్టణ ప్రణాళిక విభా గానికి చెందిన ఓ అధి కారి స్పెషల్ ట్యాక్స్‌కు తెరతీ శారు. అడగడానికి కార్పొరేటర్లు కూడా లేకపోవడంతో సదరు అధికారి నేరుగా నిర్మాణదారులతోనే డీ ల్ కుదుర్చుకుంటున్నారు. డీల్ కుదరకుంటే తమ సిబ్బందిని పంపించి పనులు నిలిపివేయిస్తున్నారు.
రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు
నగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. నివాసగృహాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనల మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయా అనేది చూడాల్సిన పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు ఒకరిద్దరు నిబంధనల నెపంతో వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగాలున్నాయి. ఓ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి యథేచ్ఛగా వసూళ్ల దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వసూళ్లు తన ఒక్కడికే కాదని, పై అధికారులను కూడా మచ్చిక చేసుకోవాల్సి ఉంటుందంటూ నిర్మాణదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న వ్యవహారం ప్రస్తుతం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. నిర్మాణం జరుగుతున్న భవనం ఆధారంగా రూ.1లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసిన ఉదంతాలను బల్దియాలో కథలుగా చెప్పుకుంటుండం విశేషం.
భయమే పెట్టుబడి
టౌన్‌ప్లానింగ్ విభాగ అధికారి వసూళ్ల దందాకు భవన నిర్మాణదారుల భయమే పెట్టుబడిగా మారింది. మున్సిపల్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించి భవనం నిర్మించడం దాదాపు అసాధ్యంగా నిర్మాణదారులు భావిస్తుంటారు. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టినా, పూర్తిస్థాయిలో సెట్‌బ్యాక్‌లేదని, శ్లాబ్ సెంటిమీటరు ముందుకొచ్చిందని, ర్యాంప్ రోడ్డుమీదికొచ్చిందని.. ఇలాంటి కారణాలేవో చెప్పి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఒకవేళ అన్ని నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టినా పక్కవాళ్లు ఫిర్యాదు చేశారంటూ రంగంలోకి దిగిపోతుంటారు. దీంతో అడిగినంత కాకున్నా ఎంతో కొంత ఇచ్చి పనులు కొనసాగించుకోవడం మేలనే స్థితికి నిర్మాణదారులు వస్తుంటారు. పైగా డబ్బు వసూలు చేసిన విషయం ఎక్కడైనా చెప్పినా, మీ భవనానికే నష్టమనే అధికారుల హెచ్చరికలు కూడా ఇక్కడ ఫిర్యాదుల వరకు రాకుండా చేస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో సదరు అధికారుల వసూళ్ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది.
బల్దియాలో నయా కలెక్షన్ భవన నిర్మాణదారుల నుంచి వసూళ్లు ప్రత్యేకాధికారి పాలనలోనూ తప్పని వేధింపులు
నగర శివారులోని పాత విలీన డివిజన్ అది. ఇటీవల అక్కడ ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. బల్దియా నుంచి అవసరమైన అన్ని పత్రాలు తీసుకున్నాడు. ఇదే సమయంలో.. వసూళ్లలో ఆరితేరిన పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన ఓ అధికారి కన్ను ఆ నిర్మాణంపై పడింది. ఇంకేం.. నిబంధనల నెపంతో పనులకు ఆటంకం కలిగిస్తూ, నిర్మాణదారుడికి వేధింపులు మొదలయ్యాయి. తన తప్పేంటో తెలియని సదరు నిర్మాణదారుడు భవన నిర్మాణానికి సంబంధించి అన్ని పత్రాలు చూపించాడు. కానీ మున్సిపల్ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టడం ఎవరికీ సాధ్యం కాదని, అధికారులను మచ్చిక చేసుకోకుంటే పనులు కష్టమనే ఓ మధ్యవర్తి సలహా మేరకు సదరు అధికారిని కలుసుకున్నాడు. ఆ అధికారి రూ.4 లక్షలు డిమాండ్ చేస్తే, విధిలేని పరిస్థితుల్లో రూ.2 లక్షలు చెల్లించి బతుకు జీవుడా అంటూ భవన నిర్మాణ పనులు కొనసాగించాడు.
ఫైలు పెండింగ్‌తోనే..
నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం ద్వారానే సదరు అధికారి వసూళ్ల దందాకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. భవన నిర్మాణాల అనుమతులు కోరుతూ చేసుకున్న దరఖాస్తులను ఓ పట్టాన తెమలనీయకుండా రోజుల తరబడి కాలయాపన చేస్తుండడం ఆ అధికారి ప్రత్యేకత. దరఖాస్తుదారుడు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిన సమయంలో బేరసారాలకు దిగడం ఆ అధికారి స్టైల్. తమ ఫైల్ పెండింగ్‌లో పెట్టారంటూ ఉన్నతాధికారులకు వచ్చే ఫిర్యాదుల్లో ఈ అధికారికి చెందినవే ఎక్కువగా ఉండడం నగరపాలకసంస్థ కార్యాలయంలో బహిరంగ రహస్యమే. సదరు అధికారి వసూళ్ల దందాకు కొంతమంది పై అధికారులు కూడా సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా వసూళ్లు చేస్తుండడం, ఆరోపణలు, ఫిర్యాదులొచ్చినా వీసమెత్తు చర్యలు అధికారిపై లేకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇదిలాఉంటే సదరు అధికారి స్థాయిలో కాకున్నా ఇతర అధికారులు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ నిర్మాణదారులను వేధిస్తున్న ఘటనలు నగరంలో చోటుచేసుకుంటున్నాయి. ఏదేమైనా నగరంలో పేట్రేగిపోతున్న స్పెషల్ ట్యాక్స్ దందాపై ఉన్నతాధికారులు లోతుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
స్పెషల్ ట్యాక్స్