వనరుల దోపిడీని ఆపాల్సిందే
పెద్దపల్లిరూరల్: దేశంలోని బడా కార్పొరేట్‌శక్తులకు సహజవనరుల సంపదను దోచుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నక్కనారాయణరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని కోట్లాది రూపాయల విలువైన అటవీసంపదను కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు బీజేపీ సర్కార్ చేస్తున్న యత్నాలను విరమించుకుని వనరుల దోపిడీని ఆపాల్సిందేనన్నారు.
ఆదివాసీలపై అరాచకం..
అటవీ సంపదను దోపిడీ చేసేకుట్రలో భాగంగానే పసిగుడ్డు మొదలు పండుముదుసలి వరకు అందరిపైనా దాడు చేస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలను సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాపాడి వారికి అండగా ఉండేందుకు అన్నివర్గాల ప్రజలు, దళితులు, మేధావులు రక్షణగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల హననాన్ని ఆపేయాలని, మహిళలపై అత్యాచారాలను నిలిపేయాలని, దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని తీర్మానించారు.
కరీంనగర్‌లో ఏప్రిల్ 20న సభ..
ఆదివాసీహక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న కరీంనగర్‌లో బహింరగసభ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణరావు ప్రకటించారు. ఈవేదిక కన్వీనర్‌లుగా ప్రజాసంఘాల నేతలు ముడిమడుగుల మల్లన్న, మర్రి వెంకటస్వామి, తాళ్లపల్లి లక్ష్మణ్, వెంకటమల్లయ్య, రాజమల్లయ్య, రామిళ్ల బాపు, జిన్నంప్రసాద్, లెనిన్, బాలసాని రాజయ్య, దండు అంజన్న, బాపన్న, సతీశ్, సృజన్, టీపీఎఫ్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య, రాజగోపాల్, రత్నకుమార్, విశ్వనాథ్‌కు బాధ్యతలను అప్పగించినటుల పేర్కొన్నారు. నాయకులు సదానందం, శ్రీనివాస్, వెంకన్న, రాజమల్లన్న, బాపన్న, రవి, రవీందర్, సదానందం, వినోద్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్
కరీంనగర్‌లో ఏప్రిల్ 20న బహిరంగసభ