సిరిసిల్ల: నష్టాల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2001 నుంచి 50 శాతం సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. 24 ఏళ్లుగా ఈ సబ్సిడీని కొనసాగిస్తోంది. వస్త్రోత్పత్తి సాంచాలను కుటీరపరిశ్రమగా గుర్తిస్తూ కేటగిరీ–4లో విద్యుత్‌ను రూ.4కు యూనిట్‌ను సరఫరా చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతీ యూనిట్‌కు రూ.2 భరిస్తుండగా.. సాంచాల యజమానులు మిగతా రూ.2 ‘సెస్’కు చెల్లించేవారు. ఇలా 24 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యుత్ సబ్సిడీ కొనసాగుతోంది. కానీ 2001లో ఇచ్చిన జీవో ప్రకారం 20 సాంచాలు(అంటే 10 హెచ్‌పీల) వరకే ఈ విద్యుత్ సబ్సిడీని అందించాలని స్పష్టం చేశారు. కానీ సిరిసిల్లలో నెలకొన్న ఆకలిచావులు, ఆత్మహత్యల నేపథ్యంలో 10 హెచ్‌పీల నిబంధనను ఎవరూ అమలు చేయలేదు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లి 10 హెచ్‌పీల నిబంధన అమలు చేయాలని ఆర్డర్ తేవడంతో సబ్సిడీ సమస్య తెరపైకి వచ్చింది. మరోవైపు చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ఎల్‌ఆర్.ఆర్‌సీ నంబరు 895/2014–పి.తేదీ: 20.05.2024 ద్వారా సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి సాంచాలకు సంబంధించిన పరిశ్రమల టారిఫ్ అమలు చేయాలని 10 హెచ్‌పీల నిబంధనల అమలులోకి తేవాలని కోరారు.
బ్యాక్ బిల్లింగ్‌తో సమస్యలు
కోర్టు ఆదేశాలు.. చేనేత జౌళిశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సిరిసిల్లలో 119 కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీని రద్దు చేసిన సిరిసిల్ల ‘సెస్’ అధికారులు వంద శాతం బిల్లింగ్ చేశారు. 20 సాంచాల కంటే ఎక్కువ సాంచాలు ఉన్న కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీ లేకుండా వినియోగించిన ప్రతీ యూనిట్‌కు రూ.7.80 చొప్పున బిల్లులు ఇచ్చారు. దీంతో గతంలో ప్రతీ యూనిట్‌కు రూ.2 చెల్లించిన వస్త్రోత్పత్తిదారులు ఇప్పుడు రూ.7.80 చెల్లించలేక కార్ఖానాలను మూసివేశారు. 2017 నుంచి వినియోగించిన విద్యుత్‌కు బ్యాక్ బిల్లింగ్ పేరిట ఒక్కో కార్ఖానాకు రూ.10లక్షల నుంచి రూ.1.20కోట్ల వరకు విద్యుత్ బిల్లులు విధించారు. బ్యాక్ బిల్లింగ్ చెల్లించలేక కొందరు కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందగా.. అదీ తాత్కాలికమే కావడంతో బ్యాక్‌బిల్లింగ్ సమస్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ సిరిసిల్లలో బహిరంగ విచారణ చేపట్టారు. బ్యాక్ బిల్లింగ్‌ను రద్దు చేయాలని, 10 హెచ్‌పీల వరకు పవర్‌లూమ్స్‌కు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, 10 నుంచి 25 హెచ్‌పీల వరకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని వస్త్రోత్పత్తిదారులు కోరారు. దీనిపై విద్యుత్ నియంత్రణ మండలి ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా గతంలో ప్రకటించిన 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, నిధులు కేటాయించడం విశేషం. బ్యాక్‌బిల్లింగ్‌తో మూతపడిన కార్ఖానాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సిరిసిల్లలోని వంద కార్ఖానాల్లో మళ్లీ సాంచాలపై వస్త్రోత్పత్తి సాగనుంది.
25 హెచ్‌పీలకు 50 శాతం విద్యుత్ రాయితీ
50 సాంచాల ఆసాములకు సబ్సిడీ వర్తింపు
రూ.49.04 కోట్లతో అమలు
సిరిసిల్లలో బ్యాక్ బిల్లింగ్ అసలు సమస్య
ఇది సిరిసిల్లలోని 50 సాంచాలు(25 జోడీల) కార్ఖాన. ఇక్కడ ఎనిమిది మంది నేతకార్మికులు పనిచేస్తారు. నిత్యం రూ.250 నుంచి రూ.350 వరకు ఒక్కో కార్మికుడు ఉపాధి పొందుతుంటారు. ఇలాంటి 50 సాంచాల వస్త్రోత్పత్తి కార్ఖానాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గతేడాది నవంబర్‌లోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) సిపార్సు చేసింది. గతంలో 10 హెచ్‌పీల సామర్థ్యం గల సాంచాల కార్ఖానాలకు 50 శాతం విద్యుత్ రాయితీ వర్తించేది. కానీ దాన్ని 25 హెచ్‌పీలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.49.04కోట్లతో 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల పట్టణంతోపాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, తంగళ్లపల్లి, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ప్రయోజనం కలుగనుంది. 50 సాంచాల ఆసామికి 50శాతం విద్యుత్ సబ్సిడీ వస్తే సిరిసిల్ల ప్రాంతంలోని 90 శాతం వస్త్రోత్పత్తిదారులకు మేలు కలుగుతుంది. కేవలం వందలాది సాంచాలున్న పెద్దసేట్లకు మాత్రం 50 శాతం విద్యుత్ సబ్సిడీ వర్తించదు. అంటే.. చిన్న, మధ్యతరగతి ఆసాములు, వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.