
అయ్యా.. ‘చేయూత’ ఏదయా
కరీంనగర్ అర్బన్: ప్రతి నెలా ఠంచన్‌గా రావాల్సిన చేయూత పింఛన్ నెల దాటినా దిక్కులేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రతి నెలా తొలివారంలోనే డబ్బులొచ్చేవి. క్రమేణా నెలాఖరుకు చేరగా తాజాగా నెల దాటినా పింఛన్ అలజడి లేకపోవడం ఆందోళనకర పరిణామం. పింఛన్‌పైనే ఆధారపడి జీవించే వృద్ధులు లేకపోలేదు. ఎప్పుడొస్తాయోనని ఎదురుచూసేవారు వేలల్లో ఉండగా పడిగాపులు అనివార్యమయ్యాయి. అధికారులను సంప్రదిస్తే డబ్బులు వస్తాయని చెబుతున్నారని, తీరా ఏప్రిల్ రావడంతో గందరగోళం నెలకొంది.
ఎందుకిలా..
జిల్లాలో ఆసరా పింఛన్ల కింద మొత్తం 1,23,041 మంది లబ్ధిపొందుతున్నారు. ప్రతి నెలా దివ్యాంగులకు రూ.4016, ఇతర పింఛన్లకు రూ.2016 చెల్లిస్తున్నారు. కాగా 6 నెలలుగా సకాలంలో పింఛను రాకపోవడంతో సంబంధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లడం రాలేదన్న సమాచారంతో నిరాశగా వెనుదిరగడం లబ్ధిదారుల వంతవుతోంది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి.
కొత్త పింఛన్లు ఇంకెప్పుడో?
లబ్ధిదారుల సంగతి అటుంచితే కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు లేకపోగా ఇప్పుడు అప్పుడంటూ ప్రభుత్వ ప్రకటనల క్రమంలో అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుండగా మంజూరు మాటే లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలమంది కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం ప్రకటించగా నేటికి వాటి ఊసే లేదు. 57ఏళ్లు నిండినవారికి పింఛన్ ఇస్తామని గత ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా వేలమంది దరఖాస్తు చేశారు. వాటి పరిశీలన ప్రక్రియ చేపట్టకపోగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కొత్త పింఛన్లు సుమారు 20వేల వరకు వచ్చే అవకాశముండగా ఇంకా స్పష్టత లేకపోవడం ఆరోపణలకు తావిస్తోంది.
పెరగనున్న లబ్ధిదారులు
ఆసరా పింఛన్‌దారుల వయస్సు 57కు తగ్గించగా, గ్రామ, మండలస్థాయిలో పరిశీలించి జిల్లావ్యాప్తంగా 14వేలకు పైగా అర్హులు ఉన్నట్లు గుర్తించారు. దీనికితోడు కొత్త దరఖాస్తులు వేలల్లో ఉండగా అతీగతి లేదు. దివ్యాంగులకు రూ.4,016, ఇతర పింఛన్లకు రూ.2,016 చెల్లిస్తుండగా దరఖాస్తుల క్రమంలో పింఛన్లు చెల్లిస్తే లబ్ధిదారుల సంఖ్య 20వేలకు పైగా చేరుకోనుంది.
జిల్లాలో మండలాల వారీగా పింఛన్
తీసుకుంటున్నవారు..
మండలం మొత్తం పింఛన్లు
చిగురుమామిడి 6,692
చొప్పదండి 7,527
ఇల్లందకుంట 4,574
గంగాధర 9,946
గన్నేరువరం 3,414
హుజూరాబాద్ 6,352
హుజూరాబాద్‌అర్బన్ 2,256
జమ్మికుంట 5,502
జమ్మికుంటఅర్బన్ 2,599
కరీంనగర్‌రూరల్ 5,458
కరీంనగర్‌అర్బన్ 19,493
కొత్తపల్లి 6,512
మానకొండూర్ 8,706
రామడుగు 8,281
సైదాపూర్ 6,418
శంకరపట్నం 6,361
తిమ్మాపూర్ 6,991
వీణవంక 5,959
మొత్తం 123,041
మార్చి నెల దాటినా ఖాతాకు పింఛన్ చేరలే
వృద్ధులు, దివ్యాంగుల పడిగాపులు కొత్త అర్జీలకు కలగని మోక్షం
మందులకు పైసల్లేవు
ఎప్పుడైనా ప్రతి నెలా మొదటివారంలో పింఛన్ డబ్బులు వచ్చేవి. ఏమైందో కానీ కొన్ని నెలలుగా వచ్చే పింఛన్ అవసరానికి ఉపయోగపడటం లేదు. నెలాఖరుకు పింఛన్ వేస్తున్నారు. ఇప్పుడేమో అవీ దిక్కులేదు. ఇంకా మార్చి నెల డబ్బులు రాలే. ప్రతి నెల మందులు వాడాలి. ఇప్పుడేమో చేతిలో డబ్బులు లేవు.
– బి.మల్లారెడ్డి, హుజూరాబాద్

అయ్యా.. ‘చేయూత’ ఏదయా

అయ్యా.. ‘చేయూత’ ఏదయా