
అట్రాసిటీ కేసులు పరిష్కరించండి
కరీంనగర్: జిల్లాలో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా పో లీసులు బలమైన సాక్ష్యాలను సమర్పించి, నిందితులకు శిక్షపడేలా చూడాలన్నారు. పెండింగ్‌కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి, త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలన్నారు. అట్రా సిటీ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వైద్య నివేదికలు పంపాలని ఆదేశించారు. కులం సర్టిఫికెట్ సమర్పించని కారణంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి, వెంటనే సంబంధిత సర్టిఫికెట్ జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూమి సంబంధిత కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. అంబేద్కర్ విద్యానిధికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెలా సివిల్ రైట్స్‌డే నిర్వహించాలన్నారు. మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంబించాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని పోలీసుశాఖకు సూచించారు. కరీంనగర్ బాలసదనంలో పెరిగిన అనాథ ఎస్సీ యువతికి వివాహం జరి పించిన కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా సంక్షేమ అధికారి సబితను ప్రత్యేకంగా అభినందించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్‌దేశాయ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలా దేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.
ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబునాయక్ పాల్గొన్నారు.
పోస్టుల భర్తీలో రిజర్వేషన్ తప్పనిసరి
సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య