
56 పోస్టులు.. 40 ఖాళీలు
● జిల్లా మార్కెటింగ్‌శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు ● డీఎంవో నుంచి మార్కెట్ కార్యదర్శుల వరకు అదనపు బాధ్యతలు ● సీజనొస్తున్నా.. సిబ్బంది భర్తీ ఏది?
కరీంనగర్ అర్బన్:
మరోవారం, పది రోజుల్లో పంటల కొనుగోళ్లతో కళకళలాడనున్న వ్యవసాయ మార్కెట్లలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. సిబ్బంది లేమితో పరిపాలన కునారిల్లుతుంటే భర్తీ మాటే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పొరుగు సేవల సిబ్బంది ఉండగా ఇచ్చే వేతనానికి నిబద్ధతతో పనిచేసే అవకాశముండదన్నది నిర్వివాదాంశం. ఆ క్రమంలో మార్కెటింగ్‌శాఖను గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది.
జిల్లా మార్కెటింగ్‌శాఖలో ఇద్దరే
వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ, అధికారుల పనితీరు, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన గురుతర బాధ్యత జిల్లా మార్కెటింగ్ శాఖది. కానీ జిల్లా విభజనతో కార్యాలయం బోసిపోయింది. సదరు కార్యాలయ మంజూరు పోస్టులు పది. ఏడీఎం, సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్, రికార్డర్, టైపిస్టు, జూనియర్ ఆడిటర్ ఒక్కొక్కరు ఉండాల్సి ఉండగా ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ కార్యాలయంలో ఒక జూనియర్ ఆడిటర్, ఒక అటెండర్ మాత్రమే మిగిలారు. మిగతా పోస్టులన్ని ఖాళీయే. పొరుగు సేవల కింద డాటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు.
ఒక్కో అధికారికి జోడు పదవులు
జిల్లా మార్కెటింగ్‌శాఖ ఖాళీలు అటుంచితే వ్యవసాయ మార్కెట్లలోనూ అదే పరిస్థితి. జిల్లాలో 8 వ్యవసాయ మార్కెట్ యార్డులుండగా ప్రధాన మార్కెట్లలోనూ ఖాళీల కొరత వెక్కిరిస్తోంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశం మినహా మిగతా మార్కెట్లకు జోడు పదవులే రాజ్యమేలుతున్నాయి. జమ్మికుంట గ్రేడ్–1 సెక్రటరీ రాజా హుజూరాబాద్ మార్కెట్ ఇన్‌చార్జి సెక్రటరీగా వ్యవహరిస్తుండగా గోపాల్‌రావుపేట, మానకొండూరు మార్కెట్లకు సెక్రటరీగా శ్రావణ్, చొప్పదండి, సైదాపూర్ మార్కెట్లకు ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ ఏసీబీకి పట్టుబడగా ఎవరిని నియమించలేదు. మార్కెట్ ఆదాయాన్ని బట్టి సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 కార్యదర్శుఽల నియామకం ఉంటుండగా రూ.6కోట్ల ఆదాయం గల కరీంనగర్, జమ్మికుంట మార్కెట్లకు సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి విధులు నిర్వహిస్తుంటారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి, గ్రేడ్–2 కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉన్నాయి. యార్డుల్లో పర్యవేక్షణకు సంబంధించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో ఒక పోస్టయిన సహాయ కార్యదర్శి, అకౌంటెంట్, పర్యవేక్షకుడు, జేఎంఎస్, డ్రైవర్, వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జమ్మికుంటలో టైపిస్టు, ఏఎంఎస్ ఒకటి, జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ (జేఎంఎస్) మూడింటికి రెండు, అటెండర్ రెండింటికి రెండు, వాచ్‌మెన్ అయిదింటికి నాలుగు ఖాళీలే.
ఆడ్తిదారులు, ఖరీదుదారులదే రాజ్యం
వ్యవసాయ మార్కెట్లలో నిబంధనల మేరకు కొనుగోళ్లు, చెల్లింపుల ప్రక్రియ జరగాల్సి ఉండగా రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లలో తక్‌పట్టీల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నగదు కోత పెట్టడం పరిపాటిగా సాగుతోంది. ఏ వ్యాపారమైనా మార్కెట్‌కు ఒక శాతం పన్ను కట్టాల్సి ఉండగా పూర్తిస్థాయి అధికారి లేక లక్షల ఆదాయం కోల్పోతోంది. జమ్మికుంట మార్కెట్లో ఈ– నామ్ అమలు అంతంతమాత్రమే కాగా వేలంలా ధరలను నిర్ణయించడం గమనార్హం. మార్కెట్ యార్డుల్లో పర్యవేక్షకులు, సహాయ మార్కెట్ పర్యవేక్షకులు, జూనియర్ మార్కెట్ పర్యవేక్షకుల పాత్ర కీలకం. అయితే సిబ్బంది లేకపోవడం, ఉన్న అధికారుల్లో కొందరు వీరికే దాసోహమవడం రైతన్నకు తీరని నష్టం కలుగుతోంది. ఖాళీల భర్తీపై గతంలో నివేదికలు అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారి వివరించారు.
ఇది కరీంనగర్ వ్యవసాయ మార్కెట్. మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం ఇటీవల ఏసీబీకీ పట్టుబడగా సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరిని నియమించకపోగా సదరు కార్యదర్శే గంగాధర మార్కెట్‌కు ఇన్‌చార్జి. ఇప్పుడు ఈ రెండు మార్కెట్లకు కార్యదర్శులు లేరు.
మార్కెటింగ్‌శాఖ జిల్లా కార్యాలయమిది. జిల్లా విభజనతో సిబ్బందిని ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయడంతో అన్నీ ఖాళీలే. జిల్లా మార్కెటింగ్ అధికారిగా మంచిర్యాల డీఎంవో షాబుద్దీన్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. మిగతావారంత పొరుగు సేవల సిబ్బందే. మంజూరు పోస్టుల ప్రకారం భర్తీ శూన్యం.

56 పోస్టులు.. 40 ఖాళీలు

56 పోస్టులు.. 40 ఖాళీలు