
రివర్ ఫ్రంట్‌పై తలోమాట!
● వరద నివారణ పనులే చేపట్టామన్న నీటిపారుదల విభాగం ● పర్యావరణ అనుమతులు పొందుతామన్న టూరిజం ● తన నష్టాన్ని నీటిపారుదలశాఖ భరించాలన్న కాంట్రాక్టర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్‌కు తలమానికంగా చేపడుతున్న మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులపై ఇరిగేషన్, టూరిజం విభాగాలు, కాంట్రాక్టు సంస్థ తలోమాట అంటున్నాయి. వీణవంక మండలానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి గతేడాది మానేరు రివర్‌ఫ్రంట్‌కు పర్యావరణ అనుమతులు లేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా కలెక్టర్, జిల్లా నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఆయా విభాగాలు తలోమాట అంటున్నాయి.
● నీటి పారుదల విభాగం అఫిడవిట్‌లో.. ‘మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్‌ఎఫ్) మా ప్రాజెక్టు కాదు. మేం అక్కడ కేవలం వరద నియంత్రణ చర్యలు మాత్రమే చేపడుతున్నాం. నీటి నాణ్యత పెంచడం, అక్కడి సహజ జీవావరణం పునరుద్ధరించడమే మా లక్ష్యం. వాస్తవానికి మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పర్యాటక శాఖకు సంబంధించింది. మేం కేవలం మానేరు నది పరిసరాల్లో వరద నియంత్రణ చర్యలు మాత్రమే చేపడుతున్నాం. ఎల్‌ఎండీ దిగువ ప్రవాహంలో నదికి రెండువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న చెక్ డ్యాం–2ను బలోపేతం చేయడం, హాఫ్ బరాజ్‌ని నిర్మించడం, ఫీడర్ కెనాల్‌లో తవ్వకాలు జరిపి మంచినీటిగా మార్చడం. ఇందుకోసం మేం ఎలాంటి భూసేకరణ చేపట్టలేదు. ఎలాంటి నీటి నిల్వ చేపట్టలేదు. ఈ పనులకు పర్యావరణ అనుమతులు అక్కరలేదు’ అని వివరించింది.
● మరోవైపు తాము కేవలం పర్యాటకం కోసం మాత్రమే ఎంఆర్‌ఎఫ్ ప్రాజెక్టును 1.50 లక్షల చదరపు మీటర్లలో చేపట్టామని పర్యాటకశాఖ ఎన్జీటికి సమర్పించిన లేఖలో పేర్కొంది. ఇందులో ‘ఎంట్రన్స్ ప్లాజా’ కోసం 2.59 ఎకరాలు, ‘వ్యూ గ్యాలరీ’ కోసం 1.15 ఎకరాలు, నదిలో కడుతున్న ‘ఫౌంటేన్’ కోసం 350 గజాల స్థలం మాత్రమే సరిపోతుందని తెలిపింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) సర్వే చేపడతామని కూడా స్పష్టం చేసింది.
మానేరు రివర్ ఫ్రంట్
నష్టాన్ని భరించాల్సింది మీరే: కాంట్రాక్టు సంస్థ
తమ పనులు నిలిపివేయాలని ఆదేశించిన ఇరిగేషన్ విభాగానికి ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఎస్‌ఎల్‌ఆర్, హెచ్‌ఈఎస్ (వీజే) సంస్థ కూడా తన ఇబ్బందులను వివరిస్తూ లేఖ రాసింది.
ప్రాజెక్టులో భూసేకరణ, డ్రాయింగ్స్, డిజైన్స్, పర్యావరణ సర్వే తదితరాలు పూర్తిగా డిపార్ట్‌మెంట్లకు సంబంధించినవని తెలిపింది.
సంక్లిష్ట దశలో పనులు నిలిపివేయాల్సి వచ్చిందని, ఈ దశలో పనులు ఆపడం వల్ల బరాజ్‌లకు జరిగే నష్టానికి తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేసింది.
ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన మానవ వనరులు, యంత్రాలు, సామగ్రి అన్నీ తమ వద్ద ఉన్నాయి. ఆకస్మికంగా పనులు ఆపివేయడం వల్ల ఇవి పనికి రాకుండా పాడయ్యే ప్రమాదం ఉంది.
తమ యంత్రాలు, సామగ్రిని తరలించేందుకు కావాల్సిన ఖర్చును అదనంగా డిపార్ట్‌మెంట్ భరించాల్సి ఉంటుంది.
ప్రాజెక్టులో నిలుస్తున్న నీటిని తోడేందుకు అదనంగా డీ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా భరించాలని స్పష్టంచేసింది.