
అంజన్నకు రూ.1.67కోట్ల ఆదాయం
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.1,67,73,800 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. ఈనెల 11 నుంచి చిన్న జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. స్వామివారి సన్నిధిలో 2.50 లక్షల మంది భక్తులు దీక్ష విరమణ చేశారని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. లడ్డూప్రసాదాల ద్వారా రూ.81,74,600, పులిహోర ద్వారా రూ.15,42,200, దీక్ష విరమణల ద్వారా రూ.40,17,500, కేశఖండనం ద్వారా రూ.11,78,000, శీఘ్రదర్శనం ద్వారా రూ.18,61,500, మొత్తంగా రూ.1,67,73,800 ఆదాయం వచ్చిందన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.17,68,265 అదనంగా వచ్చిందని పేర్కొన్నారు.
మళ్లీ వస్తాం అంజన్న..
మూడురోజులపాటు కొండపైన శ్రీరామ నామం మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి వరకు మాల విరమణ చేసిన దీక్షాపరులు సోమవారం ఉదయం ఇంటికి బయల్దేరారు. మూడు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి కాలినడక, వాహనాల్లో వచ్చారు. హనుమాన్ భక్తులు దీక్ష విరమణ అనంతరం మొక్కులు చెల్లించుకుని ఇంటికి బయల్దేరారు.
వైభవంగా చిన్న జయంతి ఉత్సవాలు
2.50 లక్షల మంది భక్తుల రాక
ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు