
యువవికాసం!
దరఖాస్తుల
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాలా మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు
పెద్దపల్లి: 47,470, జగిత్యాల: 31,128రాజన్నసిరిసిల్ల: 23,477, కరీంనగర్: 29,000
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియటంతో నిరాశచెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మందికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాసారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది.
ఆరేళ్ల తర్వాత..
6 ఏళ్ల తరువాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండటంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు.
సెలవులతో అర్జీలు పెండింగ్‌లో
రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికెట్స్ కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కుల సర్టిఫికెట్స్ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ
కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్‌లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస్ పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది.
– ఏదుల కిరణ్‌కుమార్, జగిత్యాల

యువవికాసం!