
అజ్ఞాతంలోనే నాలుగు దశాబ్దాలు
కోరుట్ల: మావోయిస్టుల్లో 1985లో చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల వసంత (68) సుమారు 40 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే గడిపారు. 2001లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శిగా పనిచేస్తూ భర్త పసుల రాంరెడ్డి చనిపోయినా.. ఆమె ఉద్యమబాటను వదిలిపెట్టలేదు. ఆయన లేకున్నా.. భర్త అడుగుజాడల్లో మరో పాతికేళ్లపాటు ఉద్యమంలోనే గడిపి చివరగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉత్తర బస్తర్ డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పోలీసులకు పసుల వసంత 2025 జనవరిలో లొంగిపోయారు. రెండు రోజుల క్రితం ఆమె కోరుట్లలోని తన బంధువుల చెంతకు చేరింది.
ఆధార్‌కార్డు లేనే లేదు..
ఉద్యమబాటలోనే నాలుగు దశాబ్దాలు గడిపిన వసంతకు ఆధార్ కార్డు లేదు. అజ్ఞాతంలో ఉన్న ఆమె ఏనాడూ జనజీవన స్రవంతిలోకి రాకపోవడంతో ఆమెకు ఆధార్‌కార్డు అవసరమే రాలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే వసంత పేరిట రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ పరంగా రూ.ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు ఇంటలిజెన్స్ పోలీసులు వసంత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ రివార్డులు పొందాలంటే వసంతకు ప్రస్తుతం ఆధార్‌కార్డు తప్పనిసరి అయింది. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన ఆమెకు కోరుట్లలో నివాస గృహం ఉంది. కోరుట్లలోని అంబేద్కర్‌నగర్‌లో ఉన్న ఇంటి ఆధారంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కనికరించాలని వేడుకోలు
కోరుట్లకు చెందిన వసంతకు అత్తగారింటికి చెందిన ఇల్లు తప్ప ఇతరత్రా ఆస్తులు లేవు. ఆ కాలంలో రేషన్‌కార్డు తీసుకోలేదు. భర్త పసుల రాంరెడ్డి సైతం మావోయిస్టు ఉద్యమంలోనే 2001లో చనిపోవడంతో వీరిద్దరికి దాదాపుగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు లేకపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంకేర్ జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయిన సందర్భంలో అక్కడి ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు వసంత లొంగిపోయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆధార్‌కార్డును తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆమె కూతురు భవానీ జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటోంది.
ఆధార్ కార్డు ఇప్పించండి
ఉద్యమంలోనే జీవితం గడిచిపోయింది. నాకు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు వంటి ఆధారాలు ఏమీ లేవు. పోలీసులకు లొంగిపోయిన నాకు ఆరోగ్య రీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. నా పేరిట ఉన్న రివార్డును పొందగలిగితే కొంతలో కొంత నా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చని ఆశ. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా.
– పసుల వసంత, లొంగిపోయిన మావోయిస్టు
ఆధార్ కార్డుకు దిక్కులేదు
సర్కార్ రివార్డులు దక్కేదెలా..?
కనికరించాలని కలెక్టర్‌కు వేడుకోలు
మాజీ మావోయిస్టు వసంత దీనస్థితి