
రాజన్న ఆలయానికి ప్రత్యేక బోర్డు !
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పాలనలో రూపురేఖలు మారనున్నాయి. ఆదాయానికి.. బోర్డుకు సంబంధం ఉండడంతో ఏటా రూ.100కోట్లు ఆదాయం దాటే ఆలయాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే నిబంధన రాజన్న ఆలయానికి వర్తించనుంది. దీంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వస్వామి ఆలయ ప్రత్యేక బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి ఐఏఎస్ అధికారిని బాధ్యులుగా నియమించే అవకాశం ఉంటుంది.
గతంలో బోర్డులు ఇలా..
వేములవాడ రాజన్న ఆలయం పాలనకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1952లో కలెక్టర్‌ను చైర్మన్‌గా, ఐదుగురు సభ్యులతో ఆలయ బోర్డు ఏర్పాటైంది. 1956, 1958, 1962 సంవత్సరాల్లో మళ్లీ ఏర్పాటు చేశారు. 1967 నుంచి ప్రతీ రెండేళ్లకు కమిటీ మారుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది నిలిచిపోయింది.
ప్రత్యేక బోర్డుకు ప్రభుత్వం కసరత్తు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.100 కోట్లకుపైగా ఆదాయం గల ఆలయాలకు టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈప్రక్రియలో వేములవాడ రాజన్న ఆలయం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సూత్రప్రాయంగా వెల్లడించారు.
స్వయంప్రతిపత్తితో బోర్డు
వేములవాడ ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో కొత్తతరం రానుంది. బోర్డుసభ్యులతో స్వయం ప్రతిపత్తి కల్పించే దిశలో చర్చలు చేపట్టనున్నారు. త్వరలోనే బోర్డు ఏర్పాటు జరగనున్నట్లు అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఆలయ పాలనలో క్రియాశీలతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో బోర్డు ఏర్పాటు, స్వయం ప్రతిపత్తితో వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఆలయ పాలనలో స్వతంత్ర అధికార దిశగా ముందడుగు వేయబోతోంది. పాలన లోపాలకు ఈ కొత్తబోర్డు కృషి చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐఏఎస్ అధికారి నేతృత్వం, భక్తులకు పారదర్శక పాలన అందించాలన్న దిశలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
రూ.100కోట్లు దాటితే ఏర్పాటు
ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం
త్వరలోనే ఉత్తర్వులు
రూ.100 కోట్లు దాటిన ఆలయాలకు ప్రత్యేక బోర్డు
రాష్ట్రంలో రూ.100కోట్ల ఆదాయం దాటిన ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. యాదగిరిగుట్ట తరహాలో వేములవాడ రాజన్నకు సైతం బోర్డు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఇదే పద్ధతిలో పట్టణం అభివృద్ధిపై సైతం కృషి చేస్తాం.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్

రాజన్న ఆలయానికి ప్రత్యేక బోర్డు !