
రైతుల ఖాతాకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు
● మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ అర్బన్: ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్ లో ధాన్యం డబ్బులు పడేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రకటనలో సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉన్నా.. సలహాలు, సూచనల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0333కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా విద్యుత్ దీపాలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్‌కు మంత్రి ఉత్తమ్ అభినందన
జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిని అభినందించారు. జిల్లాలో ఇప్పటి వరకు 14344 మంది రైతుల నుంచి 99,408 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దొడ్డు రకాలు 90,632 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 8,756 మెట్రిక్ టన్నులు కాగా దొడ్డు, సన్న రకాలు వడ్లకు రూ.100.64 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. దీంతో పాటు సన్నరకాల వడ్లకు బోనస్ విలువ రూ.4.38 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతిపాదనలను పంపినట్లు అధికారులు వివరించారు.