సాక్షి,బళ్లారి: గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేఆర్‌పీపీ సంస్థాపకుడు, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో కన్నడిగుల ఓట్లతో పాటు తెలుగు వారి ఓట్లు కూడా కీలకం. వారు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చి ఇక్కడే స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2,02,206 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 1,00,295 మంది, మహిళలు 1,01,899 మంది కాగా ఇతరులు 12 మంది ఉన్నారు. ఈ నియోజకర్గంలో కూడా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కులాల ప్రాతిపదికన తీసుకుంటే లింగాయత్, ముస్లిం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండగా, కురుబ, ఎస్సీ, ఎస్టీలతో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. అనూహ్య పరిణామాలతో గంగావతి ఎన్నికల బరిలోకి దిగిన కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి జనార్దనరెడ్డి ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
నలుగురూ హేమాహేమీలే
బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి ఇక్బాల్ అన్సారీ, జేడీఎస్ తరఫున హెచ్‌ఆర్ చెన్నకేశవ బరిలో ఉన్నారు. వీరు నలుగురూ హేమాహేమీలే. చతుర్ముఖ పోటీ నెలకొన్నప్పటికీ కేఆర్‌పీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయని అంచనా. భత్తదనాడు, అన్నపూర్ణ నియోజకవర్గంగా, సాక్షాత్తు ఆంజనేయ స్వామి జన్మించిన పవిత్ర పుణ్యభూమిగా ఖ్యాతి పొందిన గంగావతి నియోజకవర్గ ఫలితాన్ని కల్యాణ కర్ణాటకలోనే కాకుండా రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల ప్రజలు, రాజకీయ ప్రముఖులు, అంజనాద్రికి వచ్చివెళుతున్న యావత్ దేశంలోని శ్రీరామభక్తులందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
వరుసగా గెలిచిన దాఖలాలు లేవు
గంగావతిలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్బాల్ అన్సారీ జేడీఎస్ తరఫున గెలుపొందారు. మళ్లీ 2008లో జరిగిన ఎన్నికల్లో పరణ్ణ మునవళ్లి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ జేడీఎస్ తరపున ఎమ్మెల్యేగా ఇక్బాల్ అన్సారీ గెలుపొందారు. 2018లో మళ్లీ బీజేపీ తరపున పరణ్ణ మునవళ్లి గెలుపొందారు. గత 20 ఏళ్లుగా ఇక్బాల్ అన్సారీ, పరణ్ణ మునవళ్లిలు గంగావతి రాజకీయాలను శాసిస్తున్నారు. ఒకరు ఒకసారి గెలిస్తే, మరోసారి ఓడిపోతున్నారు. ఈ ఇద్దరు నేతలు వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన పరణ్ణ మునవళ్లి ప్రధానంగా దాదాపు 60 వేలకు పైగా ఓటర్లు ఉన్న తన లింగాయత్ సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన తన సామాజిక వర్గానికి ఎలాంటి మేలు చేయలేదనే అపవాదు ఉంది.
వలసలతో బీజేపీ గుండెల్లో రైళ్లు
లింగాయత్ సామాజిక వర్గం గంపగుత్తగా పరణ్ణకు ఓట్లు వేసే పరిస్థితి లేక ఆ వర్గానికి చెందిన ప్రముఖులు కేఆర్‌పీపీలో చేరుతుండటంతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పరణ్ణ గెలుపునకు అండగా నిలవాల్సిన ప్రముఖ సామాజిక వర్గం వలస పోతుండటంతో బీజేపీ డైలమాలో పడింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీ కూడా గతంలో గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగిరీ చేసినా ఆయన నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోలేదని, అభివృద్ధిలో కూడా ఆయన వెనుకబడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఈసారి ఎన్నికల్లో దూరం పెట్టి కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన కేఆర్‌పీపీ అభ్యర్థిని గెలిపిస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆశతో గంగావతి వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment