బనశంకరి: ఒడిశాలోని బాలసోర్ జిల్లా బహనాగ వద్ద శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర రైళ్ల ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 110 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో కర్ణాటక నుంచి వెళ్లిన రైలు సైతం దెబ్బతినగా అందులో కన్నడిగులు ఎవరూ చనిపోలేదని అదనపు డీజీపీ ఎన్.శశికుమార్ తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్లిన 23 బోగీలు కలిగిన రైల్లో మూడుబోగీలు మాత్రమే దెబ్బతినగా, ఇందులో కర్ణాటకకు చెందినవారు లేరని సమాచారం. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. రైల్వే అధికారులను సంప్రదిస్తున్నామని, నాలుగుచోట్ల హెల్ప్ లైన్లను ప్రారంభించామని, రాష్ట్ర ప్రయాణికులు మృతి చెందినట్లు, గాయపడినట్లు సమాచారం లేదన్నారు.
కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఉన్న బోగీలకు ఎలాంటి ఇబ్బందిలేదని తెలిపారు. ఘటనాస్థలానికి రాష్ట్రం నుంచి పోలీసు అధికారులను పంపించామని తెలిపారు. నాలుగు హెల్ప్ లైన్లను ప్రారంభించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మరణాల గురించి అవాస్తవాలను ప్రచారం చేయరాదని కోరారు. మృతుల్లో ఎక్కువ మంది ఈశాన్య భారతానికి చెందిరవారున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదానికి గురైన హౌరా రైలు బెంగళూరులోని బైయప్పనహళ్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రమాదస్థలిలో అప్పుడే పడిపోయిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి నుంచి ఒడిశాకు వెళ్లే రైళ్లను నిలిపివేశామని శశికుమార్ తెలిపారు.
ఇద్దరు మృతి?
ఇప్పటివరకు రైలు దుర్ఘటనలో బెంగళూరు నగరానికి చెందిన ఇద్దరు మృతిచెందారని తెలిసింది. వీరు ఏ రైలులో ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. చిక్కమగళూరుకు చెందిన 110 మంది ప్రయాణికులు హౌరా రైలులో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. వీరు జార్ఖండ్ పర్యటనకు వెళుతున్నారు, అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది.
హెల్ప్‌లైన్లు ప్రారంభం
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో బాధితుల బంధువులకు సమాచారం అందించడానికి రైల్వేశాఖ సహాయవాణి ప్రారంభించింది. బెంగళూరు–080–22356409, 09606005129, 8861203980 బంగారుపేటే–081 53255253, కుప్పం– 843 1403419, నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. బాధితులు సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. కాగా బెంగళూరు నుంచి ఒడిశా మీదుగా వెళ్లాల్సిన మూడు రైళ్లను రద్దుచేశారు. 12551 నంబరు ఎస్‌వీఎంబీ–కేవైక్యూ, 12864 నంబరు ఎస్‌వీఎంబీ– హెచ్‌డబ్ల్యూహెచ్ నంబరు 12253 ఎస్‌వీఎంబీ–బీజీపి రైలు సర్వీసులు బంద్ అయ్యాయి.
ఒడిశా సర్కారుతో మాట్లాడాం: సీఎం
శివాజీనగర: తాము ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉన్నామని, కర్ణాటక ప్రయాణికుల గురించి సమాచారం కోరామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సీఎం, ఇంత పెద్దస్థాయిలో ప్రమాదం ఏనాడు జరగలేదు. కర్ణాటక వారి గురించి ఇప్పటికీ సమాచారం అందలేదు. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్లారు, వారు ఎలా ఉన్నారనేది తెలియడం లేదు కేంద్ర రైల్వే శాఖ, ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. యశ్వంతపుర రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. కర్ణాటక వారికి ఏ విధమైన హాని జరిగిందనే విషయంపై సమాచారం తెలియదు అని చెప్పారు. రైలు ప్రమాద స్థలంలో కన్నడిగుల సహాయ కార్యక్రమాల కోసం మంత్రి సంతోష్ లాడ్‌ను అక్కడకు పంపించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment