బనశంకరి: ఒకరికి మోదం, మరొకరికి ఖేదం అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ గ్యారంటీ ప్రకటించగా, ప్రైవేటు బస్సుల యజమానుల ఆదాయానికి గండి పడుతుందనే భయం యజమానుల్లో నెలకొంది. మంత్రివర్గ తీర్మానం ప్రకారం ఈ నెల 11 నుంచి ఏసీ బస్సులు మినహా మిగిలిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుంది. దీంతో ప్రైవేటు బస్సు యజమానుల్లో గుబులు నెలకొంది.
ఇప్పటికే అంతంతమాత్రం
ఇంధన ధరలు పెరగడం, పన్నుల భారంతో ప్రైవేటు బస్సులు అంతంతమాత్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 9 వేల ప్రైవేటు బస్సులు ఉన్నాయి. బస్సుల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, ట్రావెల్స్ ఏజెంట్లుతో కలిసి 75 వేలమందికి పైగా ఆధారపడి ఉన్నారు. కోవిడ్, లాక్‌డౌన్‌తో చాలా నష్టాలు అనుభవించిన ప్రైవేటు బస్సుల రంగం గత ఏడాది కాలంగా కొద్దిగా గాడిలో పడింది. ప్రస్తుతం ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడంతో మహిళలు, సహజంగా ప్రభుత్వ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తారు. నిరుపేదలు, మధ్యతరగతి మహిళలు ప్రైవేటు బస్సుల వైపు చూడరు. మరోపక్క ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్న కార్మికవర్గానికి చెందిన మహిళలు సైతం ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. దీని వల్ల తమ బస్సులకు గిరాకీ పడిపోతే నడపడం ఎలా అని ప్రైవేటు బస్సు యజమానుల్లో, అలాగే సిబ్బందిలో కలవరం నెలకొంది.
రవాణా మంత్రిని కోరతాం
సర్కారు పథకం వల్ల ప్రైవేటు బస్సులు రంగానికి నెలకు సుమారు రూ.66 కోట్ల నష్టం వస్తుందని ఆ బస్సుల సంఘం ప్రముఖులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని త్వరలో రవాణామంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తామని, ప్రైవేటు బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ వసతిని కల్పించి ఆ చార్జీలను తమకు చెల్లించాలని కోరతామన్నారు. ఇంకా పలు రకాల పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలను కోరతామని కర్ణాటక రాష్ట్ర ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు నటరాజ్ శర్మ తెలిపారు. ప్రభుత్వం దీనికి సమ్మతించకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment