సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న రాష్ట్ర యువజన, క్రీడా, ఎస్టీ వర్గాల సంక్షేమ శాఖా మంత్రి బీ.నాగేంద్రకు బళ్లారి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పదవిని కూడా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆయా జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రి పదవులు కేటాయించగా, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శ్రీరాములుపై భారీ మెజార్టీతో గెలుపొందిన నాగేంద్రకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పదవి కూడా దక్కడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది.
ఇక అభివృద్ధిని పరుగు పెట్టిస్తా: మంత్రి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంత్రి పదవితోపాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాధ్యతలు కూడా సీఎం అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టిస్తానన్నారు. జిల్లాకు డీఎంఎఫ్ తదితర నిధులతో అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతర్జాయ స్టేడియం నిర్మాణం చేపట్టడంతో పాటు జిల్లాను రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతానన్నారు.
మంత్రి అభిమానుల సంబరాలు
బళ్లారిఅర్బన్: బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రను శుక్రవారం జిల్లా ఇన్‌చార్జ్జ్ మంత్రుల నియామకంలో బళ్లారి జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించడంతో అభిమానులు రాయల్ సర్కిల్‌లో బాణసంచాను పేల్చి స్వీట్లను పంచి పెట్టి కాంగ్రెస్ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అభిమానుల సంఘం అధ్యక్షులు ఎంజీ కనక, పార్టీ నాయకులు చాగనూరు శ్రీనివాస్, బీ.మారుతీ, వై.అరుణ్‌కుమార్, అల్లీపుర్ ఆనంద్, తిప్పేరుద్ర, ఆంజనేయ, అరుణ్, నాగరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment