కర్ణాటక: రాష్ట్ర శాసనసభా సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానుండగా, అధికార, విపక్షాల మధ్య పోరాటం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠభరితంగా మారింది. కాంగ్రెస్ సర్కారు ఐదు గ్యారంటీల పథకాల అమల్లో గందరగోళం, కరెంటు చార్జీల పెంపు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మత మార్పిడి చట్టం, ఏపీఎంసీ చట్టం రద్దు చేసే విషయాలతో పాటుగా పలు విషయాలు అసెంబ్లీలో సెగలు పుట్టించే అవకాశముంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న 2వ అసెంబ్లీ సమావేశం కాగా, నెల కిందట తొలి అసెంబ్లీ సమావేశం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, నూతన సభాధ్యక్షుల ఎంపికకు పరిమితమైంది.
మూడు పక్షాల వ్యూహాలు
ఇక నేడు సోమవారం నుంచి ఈ నెల 14 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ హామీలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ రెడీగా ఉన్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షంలో సీనియర్లు సన్నద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో పలు అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వాటిపై దర్యాప్తు కు ఆదేశించినట్లు చెబుతూ అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేయడానికి కాచుకుంది.
గ్యారంటీలపై బీజేపీ దృష్టి
ముఖ్యంగా గ్యారంటీలపైనే బీజేపీ దృష్టి సారించింది. వీటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, తాము అసెంబ్లీ లోపల, బయటా ఆందోళనలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. అసెంబ్లీ లోపల కూడా పోరాటం చేపట్టేందుకు కాషాయం సిద్ధమైంది. జేడీఎస్ కూడా గ్యారంటీల మీదే ఎగువ, దిగువ సభల్లో గళమెత్తనుంది. అందుచేత ఈ సమావేశాలు వేడెక్కే అవకాశాలే అధికం. బీజేపీ ప్రభుత్వ అవధిలో జారీ అయిన మతమార్పిడి నిషేధ చట్టం, ఏపీఎంసీ చట్టాల రద్దు బిల్లులను అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టనుంది. అలాగే గతంలో సవరణలు ముందున్న ఏపీఎంసీ చట్టాన్నే మళ్లీ అమలులోకి తెస్తూ బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే గోహత్య నిషేధం చట్టంపైనా చర్చ జరగవచ్చు.
జూలై 7న సిద్దరామయ్య బడ్జెట్
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2023–24వ సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక శాఖ కూడా ఆయనే వద్దనే ఉంది. ఇప్పటివరకు ఆయన 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించారు. ఇది 14వ సారి అవుతుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 13 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఒక రికార్డుగా ఉంది.
నేడు గవర్నర్ ప్రసంగం
తొలిరోజైన సోమవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధారణంగా సంవత్సర ఆరంభంలో సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. అదే ప్రకారంగానే గత ఫిబ్రవరిలో సమావేశాల్లో ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కావడంతో గవర్నర్ ప్రసంగంతోనే ఆరంభించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment