కర్ణాటక: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు సామాన్యులను బలిగొంటున్నాయి. సగటున నిత్యం 25 నుంచి 30 మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. రక్తసంబంధీకులు, దంపతులు విగతజీవులై కుటుంబానికి తీరని శోకం మిగల్చడం వెనుక భారీ వాహనదారుల నిర్లక్ష్యం ఎంతో ఉంది. అదే కోవలో గుర్తు తెలియని టిప్పర్ లారీ ఒకటి బైక్‌ను ఢీ కొనడంతో ఆదివారం ఉదయం ఇద్దరు మరణించగా మరొకరు గాయపడ్డారు.
ఈ ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకా తరూరు గ్రామానికి సమీపంలో జరిగింది. తుమకూరు అంతరసనహళ్లికి చెందిన వివాహిత మీనాక్షి (28), ఆమె బంధువు గౌరిబిదనూరు తాలూకా తందళు గ్రామానికి చెందిన యువకుడు శశికుమార్ (23) చనిపోయారు. మీనాక్షి భర్త మదన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లికని వెళ్తుండగా..
మడకశిర నియోజకవర్గంలోని అగళికి బంధువుల ఇంటికి పెళ్లికని ముగ్గురూ ఒకే బైక్‌పై వెళుతుండగా బడవనహళ్లి రోడ్డులో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మీనాక్షి, శశి కుమార్ అక్కడికక్కడే మరణించారు. కాగా, లారీ వాహనం అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి లారీ కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment