
కర్ణాటక: దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళలు ఊహించని ప్రమాదంలో విగతజీవులయ్యారు. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన తుమకూరు నగరంలోని కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం ఈ ఘోరం చోటు చేసుకుంది. మండ్య జిల్లా శ్రీరంగ పట్టణ తాలూకా కేశెట్టి హళ్లి గ్రామానికి చెందిన పుట్టతాయమ్మ (60), పంకజా (50) మృతులు.
వీరిద్దరు ఇంటి పక్కనే ఉండే మరికొందరి మహిళలతో కలిసి తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకాలోని గొరవనహళ్లి మహాలక్ష్మీ ఆలయానికి బస్సులో తుమకూరు చేరుకున్నారు. కొరటిగెరైవెపు వెళ్లే బస్సులు కోసం వేచి ఉన్నారు. కొద్దిసేపు అనంతరం కొరటిగెరె వెళ్లే బస్సు రావడంతో అందరూ కలిసి బస్సులో ఎక్కడానికి ముందుకు వెళ్లారు. అదే సమయంలో గౌరిబిదనూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ రివర్సు తీసుకుంటూ వీరిని ఢీకొట్టాడు.
దీంతో పుట్టతాయమ్మ, పంకజ ఇద్దరు రెండు బస్సుల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి వస్తే ప్రాణాలు పోయాయని వీరితో పాటు వచ్చిన మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. నగర ట్రాఫిక్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు .
Comments
Please login to add a commentAdd a comment