కర్ణాటక: సిద్ధాంతాలను గాలికొదిలేసి రాజకీయ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే వారిని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల గతేమిటని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ పరోక్షంగా జేడీఎస్ నేత కుమారస్వామిపై ధ్వజమెత్తారు. సోమవారం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నపట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.సీ.అశ్వత్థతో కలిసి ఆయన మాట్లాడారు.
రాష్ట్ర సమస్యను పరిష్కరించకపోతే పార్టీని విసర్జించి రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదే పదే చెబుతున్నారని, అధినాయకులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తే పార్టీ నమ్ముకొన్న నాయకులు, కార్యకర్తల గతేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధానపరిషత్ సభ్యుడైన సీ.ఎం.ఇబ్రహీం రాజీనామా చేసి జేడీఎస్‌లో చేరిన సమయంలో ఆయనకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. జేడీఎస్, బీజేపీ పొత్తు విషయం ఇబ్రహీంకు సమాచారం లేదని దుయ్యబట్టారు.
జేడీఎస్‌లో ఉన్నవారు వరుసగా కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, తాము ఎవరినీ పిలువాల్సిన అవసరం లేదన్నారు. బీదర్ నుంచి చామరానగర వరకు అన్ని జిల్లాల్లో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలపై నిలిచిందేగాని వ్యక్తిపై కాదన్నారు. తాను లేకపోయినా పార్టీ మిమ్మల్ని కాపాడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment