
ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.2.25 కోట్లు
అడ్డంగా నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
చెప్పింది చెప్పినట్టు ట్రాన్స్‌ఫర్ చేసిన టెకీ
సాక్షి, బెంగళూరు: ఓవైపు రోజురోజుకీ టెకాల్నజీ కొత్త పుంతలు తొక్కుతుంటే..మరోవైపు ఆన్‌లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్‌కు వచ్చిన లింకును ఓపెన్ చేయడం, తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మి సైబర్ వలలో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. ఈజీ మనీ కోసం అలవాటుపడుతున్న జనం తమ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. తాజాగా ఓ యువకుడు సైబర్ మోసగాడి మాటలు నమ్మి రూ. 2 కోట్లు కోల్పోయాడు. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని టెక్కీని భయపెట్టి రూ.2.25 కోట్లు దోచుకున్నారు సైబర్ వంచకులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
అమృతహళ్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు వారం రోజుల క్రితం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారి పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అందులో ఏడీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, పార్శిల్ ఢిల్లీలో ఉందని, త్వరలో మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించాడు. ఈ పార్శిల్ మీది కాకుంటే యాంటి నార్కొటిక్ బ్యూరోకి ఫిర్యాదు చేయవచ్చని అందుకు స్కైప్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాడు.
యాప్‌లో చాట్ చేసిన అపరిచిత వ్యక్తి మీపై అక్రమ డబ్బు రవాణా కేసు కూడా ఉందని, కేసులు కొట్టివేయాలంటే డబ్బు ఇవ్వాలని, ఆ నగదును తిరిగి మీ ఖాతాకు బదిలీ చేస్తామని నమ్మబలికాడు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 8 దఫాలుగా రూ.2.25కోట్లు బదిలీ చేశాడు. వారం తరువాత తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment