దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆర్‌ఆర్ నగరలో ఉన్న పవిత్రగౌడ ఇంటికి ఆమెను, ఆమె అనుచరుడు పవన్‌ను తీసుకెళ్లారు. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పవిత్రగౌడ మేనేజర్ దేవరాజును పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన షెడ్ వద్దకు పవిత్రగౌడతో కలిసి దేవరాజు కూడా వెళ్లాడని దర్యాప్తులో తేలడంతో శనివారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది. రేణుకాస్వామి ఉంగరం, చైన్ తదితరాలను నిందితులు లాక్కున్నట్టు పోలీసులు తెలిపారు.
దర్శన్‌ను కలిసిన నిందితులు
రేణుకాస్వామి మృతదేహం లభించగానే లొంగిపోవాలని డీల్ కుదుర్చుకున్న నిందితులు లొంగిపోవాలా, లేక కొన్ని రోజులు వేచి చూడాలా అనే మీమాంసలో పడిపోయారు. దీనిపై మైసూరులో ఒక హోటల్‌లో ఉన్న దర్శన్ వద్దకు వెళ్లి చర్చించారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు సదరు హోటల్లో కూడా మహజర్ చేయవచ్చని తెలుస్తోంది.
కరెంటు షాకిచ్చి..
రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తరువాత ఆ పరికరాన్ని బెంగళూరు–మైసూరు హైవేలో విసిరేశారు. దీంతో పోలీసులు విజయనగర ప్రాంతంలో హైవేలో పరికరం కోసం గాలింపు చేపట్టారు.
సీఐ గిరీష్ నియామకం
రేణుకాస్వామి కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలోకి సీఐ గిరీష్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలిక సీఐ గిరీష్ బదిలీపై వచ్చారు. తరువాత అక్కడే రేణుకాస్వామి హత్య వెలుగు చూసింది. దర్శన్ అరెస్టు సమయంలో గిరీష్‌ను మళ్లీ సీకే అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. అయితే కేసు విచారణకు అవసరమని గిరీష్‌ను తనిఖీ అధికారిగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment