దర్శన్‌కు దీపావళి!
రేణుకాస్వామి హత్య కేసు...
ఎట్టకేలకు హైకోర్టులో తాత్కాలిక బెయిలు మంజూరు
వెన్నునొప్పి సమస్య పరిగణనలోకి
సాక్షి, బళ్లారి, బనశంకరి: దీపావళి సంబరాల సమయంలో ప్రముఖ నటుడు దర్శన్‌కు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. ఆయనకు బెంగళూరులోని హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ సహా మరికొందరు నిందితులు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.
కోర్టులో వాదనలు..
తీవ్రమైన వెన్నునొప్పి సమస్యను చూపుతూ బెయిలు పిటిషన్ వేయగా కొన్నిరోజులుగా విచారణ సాగుతోంది. న్యాయమూర్తి విశ్వజిత్‌శెట్టి ధర్మాసనం చివరకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉంది. మైసూరులో చికిత్స తీసుకోవాలని దర్శన్ న్యాయవాది నాగేశ్ వాదించారు. సర్కారు వకీలు ప్రసన్నకుమార్ బెయిలు ఇవ్వరాదని వాదించారు. కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని, చికిత్స తీసుకోకపోతే మూత్ర నియంత్రణ కోల్పోవడంతో పాటు మునుముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రి నరాలరోగ నిపుణుడు విశ్వనాథ్ నివేదిక ఇచ్చారని నాగేశ్ తెలిపారు. దర్శన్ ఇప్పటికే రెండుసార్లు మైసూరు ప్రైవేటు ఆసుపత్రి శస్త్రచికిత్స చేసుకున్నారని చెప్పారు.
జైలువద్దకు భార్యాపిల్లలు
బెయిల్ లభించగానే దర్శన్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు, బంధువులు బళ్లారి సెంట్రల్ జైలుకు వచ్చారు. కోర్టు నుంచి పత్రాలు అందిన తరువాతే జైలు నుంచి దర్శన్‌ను విడుదల చేస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. జైలు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు.
తప్పుచేసిన వారికి శిక్షపడాలి
రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య హరిహరలో విలేకరులతో మాట్లాడుతూ కొడుకు హత్యతో చాలా బాధలో ఉన్నాము. కోడలు కాన్పు కోసం ఇక్కడ పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఎవరు తప్పుచేసినా శిక్షపడాలనేది మా డిమాండ్. నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment