లారీని ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు– కంటెయినర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో 5 మంది తీవ్ర గాయాలపాలైన సంఘటన దొడ్డబళ్లాపురం–దాబస్‌పేట ఎస్‌టీఆర్‌ఆర్ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. దొడ్డ తాలూకా రామేశ్వరం గేట్ వద్ద ఎస్‌టీఆర్‌ఆర్ రహదారిపై కారు వేగంగా వస్తూ డివైడర్‌ను ఢీకొని ఎగిరి అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. కారు నుజ్జు కాగా అందులోని ఉన్న ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. దొడ్డబెళవంగల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జంటగా వెళ్తున్నారని దాడి
దొడ్డబళ్లాపురం: రోడ్డుపై డిగ్రీ కాలేజీ విద్యార్థి, విద్యార్థిని కలిసి వెళ్తుండగా యువకునిపై ఓ వర్గం యువకులు దాడి చేసి కొట్టారు, ఈ సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. విద్యార్థిని ఎండ కారణంగా నల్లటి దుపట్టా తలమీద వేసుకుని దళిత యువకుడు యశ్వంత్‌తో కలిసి వెళ్తోంది. యువతి బుర్కా ధరించింది, తమ వర్గం ఆమెతో అతడు వెళుతున్నాడు అని ఓ వర్గం యువకులు భావించి అతనిని అడ్డుకున్నారు. మా మతానికి చెందిన యువతితో కలిసి వెళ్తావా అని అతనిని కొట్టారు. తాను హిందూ యువతినని ఆ యువతి కాలేజీ ఐడీ కార్డ్ చూపించడంతో ఓ వర్గం యువకులు అక్కడి నుండి పారిపోతుండగా వారిలో వసీం, జమాన్ అనే ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇంటర్ పరీక్షల్లో విషాదం
దొడ్డబళ్లాపురం: పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థిని అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోట జిల్లా ముధోళ పట్టణంలో జరిగింది. తేజస్విని దొడ్డమని (17) ఆ విద్యార్థిని. శారద ప్రైవేటు పీయూసీ (ఇంటర్) కళాశాలలో చదువుతున్న తేజస్విని ఫిబ్రవరి 27న పరీక్షల సమయంలో కాపీ కొడుతోందని తనిఖీ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. పరీక్ష రాయకుండా ఆమెను డీబార్ చేయడంతో తీవ్ర వ్యథకు గురైంది. ముధోళ సమీపంలోని మహారాణి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఎండిన బోరు, పండని పొలం.. రైతన్న ఆత్మహత్య
మైసూరు: అప్పుల బాధను తట్టుకోలేక అన్నదాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని హెచ్‌డి కోటె తాలూకాలోని హళ్ళదమనుగనహళ్ళి గ్రామంలో జరిగింది. రైతు సోమ శెట్టి (55) పొలంలో సేద్యం చేయడానికి, బోరు– పంపుసెట్టు వేయడానికి సుమారు రూ. 45 లక్షల వరకు అప్పులు చేశాడు. బోరులో నీరు రాకపోవడంతో పాటు పంటలు పండలేదు. దీంతో పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చేయాలని అనుకున్నాడు. అందరూ పొలాన్ని తక్కువ ధరకు అడగడంతో కుంగిపోయాడు. పొలం నుంచి కుమారునికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పి పురుగుల మందు తాగాడు. వెంటనే కుమారుడు వచ్చి తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు, కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌డి కోటె పట్టణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
బావిలో నుంచి
చిరుత వెలికితీత
బొమ్మనహళ్లి: దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిదిరె తాలూకా హోసబెట్టు గ్రామంలో విలియం కుట్టిన్వ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని బావిలోకి చిరుతపులి పడిపోయింది. అడవిలో నుంచి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిన చిరుత బావిలో పడిపోయి గాండ్రించసాగింది. గ్రామస్తులు గమనించి మూడబిదిరె అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. అటవీ అధికారి పీ శ్రీధర్ ఆద్వర్యంలో సిబ్బంది చిరుతకు మత్తు మందు ఇచ్చారు, తరువాత బావిలోకి దిగి బోనులో బంధించి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి తరలించడంతో జనం హమ్మయ్య అనుకున్నారు.
లారీని ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు
లారీని ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment