‘నేతలు కార్పొరేట్ సంస్థల బానిసలు’
బళ్లారి అర్బన్: దేశంలో రైతులు, కార్మికులు తదితర వర్గాల ప్రజలు ఎంతో కష్టంతో కనీస వసతులతో జీవిస్తుండగా, రైతులు సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని కర్ణాటక దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎన్. మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బీడీఏఏ మీటింగ్ హాల్‌లో శుక్రవారం జనతా ప్రణాళిక అనే వినూత్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం కడు భారంగా మారడంతో అప్పులు పాలైన అన్నదాతలు వాటిని తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతన్నల రుణాలను రద్దు చేయని పాలకులు కార్పొరేట్ సంస్థల లక్షల కొద్ది రుణాలను రద్దు చేస్తున్నారని, దీన్ని గమనిస్తే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ఆధిపత్యంలో ఊడిగం చేస్తూ వారికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. గత 9 ఏళ్ల నుంచి సుమారు రూ.16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ఆ సర్కారు తీరును ఎండగట్టారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆందోళనకారులు సమస్యలతో పాటు వాటి పరిష్కారాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజకీయ నాయకులకు సమస్య పరిష్కారం తెలిసినా కూడా దాని పరిష్కారానికి కృషి చేయరని, ఎందుకంటే సమస్య పరిష్కారం అయితే ప్రజలు తమ వద్దకు రాకుండా పోతారని నేతలకు బాగా తెలుసన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు, పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ శక్తిని ఏర్పాటు చేసే గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త ఎన్‌డీ వెంకమ్మ, న్యాయవాది, జిల్లాధ్యక్షుడు మునిస్వామి, ప్రముఖులు శ్రీనివాస్ బండారి, మల్లికార్జున, ఎన్‌కే.గంగాధర, బైలూరు మల్లికార్జున, రైతు సంఘం జిల్లాధ్యక్షుడు వివి గౌడ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment