
ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ గరం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజలను నట్టేట ముంచుతోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాధికారి కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా తదితరులు ధర్నా చేపట్టారు. అనంతరం బీజేపీ ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పని చేయడం లేదన్నారు. వారి జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాల ధరలను పెంచుతున్నారే కాని రైతులకు మేలు చేయడం లేదన్నారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వడం లేదన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్‌కు జనం బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.
అన్ని ధరలు ౖపైపెకి..
అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సామాన్యులు జీవించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను తప్పుదారి పట్టించి ఆ వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో అమలు కాలేని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక, చివరికి ఎస్సీ, ఎస్టీ నిధులు కూడా గ్యారెంటీలకు మళ్లించడం శోచనీయం అన్నారు. గ్యారెంటీలు కూడా ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఆపేస్తారో వారికే తెలియడం లేదన్నారు. కొందరికే పథకాలు అందుతున్నాయని, మరికొందరికి అందడం లేదన్నారు. వారి స్వలాభం కోసం పథకాలను అమలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. మైనార్టీలను సంతృప్తి పరిచేందుకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. ఈ సర్కార్ కేవలం మైనార్టీల కోసమే పని చేస్తున్నట్లు కనబడుతోందన్నారు.
మెగా డైరీని తరలిస్తే ఊరుకోం
బళ్లారి జిల్లాకు మెగా డైరీని కేటాయించాలన్నారు. ఈ జిల్లా చుట్టుపక్కల అపారమైన పాడి సంపద ఉందన్నారు. ఎందరో రైతులు ఆశలు పెట్టుకున్నారని, మెగా డైరీని తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. నగరంలో ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ధరలు అమాంతంగా పెంచేశారన్నారు. బస్సు ఛార్జీలు పెంచడం శోచనీయమన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతూ పురుషులతో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఽరేట్లు మరింత పెంచారన్నారు. దీంతో మహిళల నుంచి కూడా టికెట్ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. తక్షణం పెంచిన ధరలు తగ్గించకపోతే, బళ్లారికి మెగా డైరీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. మాజీ బుడా అధ్యక్షులు డాక్టర్ మహిపాల్, మారుతీ ప్రసాద్, కార్పొరేటర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
మెగా డైరీ ఏర్పాటు చేయాలని డిమాండ్
ఎస్సీ, ఎస్టీ నిధుల స్వాహాపై మండిపాటు