
కూలీ కార్మికుడి కూతురికి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్
హుబ్లీ: కట్టడ కార్మికుడిగా పని చేస్తున్న ఆయనకు కూతురు మంగళవారం తెచ్చి పెట్టిన సంతోషం అంతా ఇంత కాదు. హుబ్లీ గోపనకొప్పలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని నాగవేణి రాయచూరు మంగళవారం వెల్లడైన ద్వితీయ పీయూసీ ఆర్ట్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించి చదువుతున్న కళాశాలకు, కన్న తల్లిదండ్రులకు ఎంతో కీర్తిని తెచ్చింది. కాగా కూతురి పరీక్ష ఫలితాలు తెలిసిన వెంటనే కళాశాల సిబ్బంది నాగవేణి తండ్రిని పని చేసే చోటకి వెళ్లి మీ కుమార్తె మా కళాశాలకు ఎంతో పేరు తెచ్చిందంటూ అక్కడికక్కడే ఘనంగా సన్మానించారు. నాగవేణి ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కృషికి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపక బృందం కారణమని అభిప్రాయపడింది. అసలు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆశించానని తెలిపింది. కన్నడలో 99, హిందీలో 96, భౌగోళికశాస్త్రంలో 100, రాజనీతి శాస్త్రం 100, ఎడ్యుకేషన్‌లో 99 మార్కులు సాధించినట్లు తెలిపింది.