
నిందితులను అరెస్ట్ చేయండి
రాయచూరు రూరల్: వరకట్నం కేసులో చిత్రహింసలకు గురి చేసి తన కుమార్తె మరణానికి కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని కళాసంకుల సంస్థ కార్యదర్శి మారుతి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతను(22) భర్త సునీల్, కుటుంబ సభ్యులు నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా అదనపు వరకట్నం తీసుకురావాలని చితక బాదడంతో ఈనెల 9న రిమ్స్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా ఈనెల 12న మరణించిందన్నారు. భర్త సునీల్, కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసినా లింగసూగూరు సీఐ వారిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు.
సోలార్ పార్కులకు
సర్కారు ప్రతిపాదనలు
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో 19 వేల మెగా వ్యాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాయచూరులో సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సోలార్‌తో పాటు పవన్, గాలి మరలతో విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు విద్యుత్ శాఖాధికారులు సమాచారం అందించారు. రాష్ట్రంలోని రాయచూరుతో పాటు బెళగావి, గదగ్, హావేరి, కొప్పళ, చిత్రదుర్గ, ఉత్తర కర్ణాటకలో విస్తరణకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో విద్యుత్ కొరత ఏర్పడినప్పుడు వీటి ద్వారా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో పథకానికి అంకురార్పణకు రంగం సిద్ధమైంది. ఆయా జిల్లాల్లో రైతులతో చర్చించి సోలార్ పార్కుల ఏర్పాటుకు భూములను గుర్తించారు.
చెరువుల సంరక్షణకు సూచన
రాయచూరు రూరల్: జిల్లాలో పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. బుధవారం బీదర్ జిల్లా మన్నాళ్ల చాంగలేరే, బావగి ప్రాంతాల్లోని చెరువులను పరిశీలించి మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. 50 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాలకు సర్వేలు చేయాలని ఆదేశించామన్నారు.
టీబీ డ్యాం కొండపై మంటలు
హొసపేటె: తుంగభద్ర డ్యాం సమీపంలో ఉన్న కొండపై ఆకస్మికంగా మంటలు ఏర్పడిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. కొండకు నిప్పు అంటుకోవడంతో కొండపై ఉన్న విండ్ పవర్ ఫ్యాన్‌లు దెబ్బ తిన్నాయి. అటవీ జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషయం గ్రహించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అనాథగా హత్య కేసు
నిందితుడు
హుబ్లీ: ఈ నెల 13న జరిగిన చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రితీష్ కుమార్ (35)కు సంబంధించి గత నాలుగు రోజుల నుంచి అతడి బంధువులెవరి ఆచూకీ తెలియలేదు. దీంతో సంబంధిత అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిందితుడిపై పోక్సో కేసు దాఖలైంది. కాగా ఈ కేసును తాజాగా మంగళవారం నుంచి సీఐడీ దర్యాప్తు చేపట్టింది. సదరు నిందితుడు గోధుమ రంగు శరీరఛాయ, పలుచని శరీరాకృతి, కోలముఖం, 5.3 అడుగుల ఎత్తు, వెడల్పైన నుదురు, కుడి చేతిపై హిందీలో ఓం నమఃశివాయ, జయ సంజయ అనే పచ్చబొట్టు ఉంది. ఇతడి ఆచూకీ తెలిసినవారు తక్షణమే 0836–2233490 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని అశోక్ నగర్ పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.

నిందితులను అరెస్ట్ చేయండి

నిందితులను అరెస్ట్ చేయండి