
అప్పు తిరిగిమ్మన్నందుకు..
● మహిళ దారుణ హత్య
● చిత్రదుర్గ జిల్లాలో ఘటన
సాక్షి,బళ్లారి: ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చి సమస్యలు తీర్చిన పాపానికి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా రామఘట్ట గ్రామానికి చెందిన ఆశా(25) చిత్రదుర్గలో ఓ ప్రైవేటు బస్సులో కండక్టర్‌గా పని చేస్తూ జీవిస్తోంది. ఆమె తనకు తెలిసిన అనిల్ అనే వ్యక్తికి రూ.56 వేలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు పదే పదే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ విషయమై పోలీసులు, పెద్ద మనుషుల దృష్టికి కూడా తీసుకెళ్లి పంచాయతీ చేశారు. అయినా డబ్బులు మాత్రం తిరిగి చేతికి అందలేదు. ఈ ఘటనతో ఆమెను ఎలాగైరా వదిలించుకోవాలన్న ఉద్దేశ్యంతో పథకం ప్రకారం అప్పు ఇచ్చిన ఆశాకు మాయమాటలు చెప్పి ఆమెను దారుణంగా హత్య చేసి అడవిలో పారవేశారు. ఘటనపై అక్కడి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి,బళ్లారి: దావణగెరె జల్లా చెన్నగిరి తాలూకా తావరకెరె గ్రామంలోని జామియా మసీదు సమీపంలో అక్రమ సంబంధం ఆరోపణలతో ఇద్దరు మహిళలపై తాలిబాన్ తరహాలో దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలపై దాడి అమానవీయం అని, ఆ సంఘటనను సీరియస్‌గా తీసుకుని తనిఖీలు చేయడంతో మహిళలపై దాడికి సంబంధించిన వీడియోలు కూడా బహిర్గతం అయ్యాయి. అంతకు ముందుకు సోషల్ మీడియాలో కూడా మహిళలపై దాడి గురించి వైరల్ చేశారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో పాటు బుధవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
విద్యుదాఘాతంతో
యువకుడు మృతి
రాయచూరు రూరల్ : విద్యుత్ వైర్ తగిలి యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన యాదగిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. యాదగిరి జిల్లా వడగేరా తాలూకాలోని బబలాది గ్రామానికి చెందిన ఖాజా పటేల్(23) మంగళవారం సాయంత్రం బబలాది నుంచి యాదగిరిలోని తన అక్క ఇంటికి వెళ్లాడు. తిరిగి గ్రామానికి వెళుతుండగా యాదగిరి మాతా మాణికేశ్వరి నగరలో జెస్కాం వైరు తెగిపోయి కిందపడిన హైటెన్షన్ వైరుపై ద్విచక్ర వాహనం వెళ్లడంతో యువకుడు విద్యుదాఘాతంతో మరణించాడు.
వక్ఫ్ బిల్లుకు సవరణపై ఆందోళన
హుబ్లీ: వక్ఫ్ బిల్లుకు సవరణను వ్యతిరేకిస్తూ దివంగత ఏజే ముధోళ అభిమాని బళగ, కట్టడ, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటీయూసీ, జాతీయ అహింద సంఘం, జాతీయ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సదరు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా ఉద్దేశపూర్వకంగా మైనార్టీల భూమిని పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దీన్ని తాము సహించబోమన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాబాజాన్ ముధోళ సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీఏ ముధోళ, అబ్దుల్ ఖాదర్ బెటగేరి, పీర్ సాబ్ నదాఫ్, కరీం లక్కుండి, రమేష్ బోంస్లే, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
నియామకం
రాయచూరు రూరల్: రాష్ట్ర వీరశైవ లింగాయత బణజిగ సమాజం కార్యవర్గ సభ్యునిగా మలకప్ప పాటిల్ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నగరానికి చెందిన పాటిల్‌ను నియమించి జిల్లాలో, రాష్ట్రంలో సమాజ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
తాగునీటి ఎద్దడి అరికట్టండి
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి ఎద్దడి రానీయవద్దని, నీటి ఎద్దడి నియంత్రణకు నగరసభ అధికారులు జాగ్రత్తలు పాటించాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధికారులకు సూచనలు జారీ చేశారు. మంళవారం నగరసభ కార్యాలయంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైనందున నాలుగు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. నీటి సౌకర్యం లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. రాంపుర జలాశయం, చిక్కసూగూరు, యరమరస్ వంటి ప్రాంతాల్లోని బూస్టర్ స్టేషన్ల నుంచి నీటి పంపింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. నగరసభ సభ్యుడు శశిరాజ్, నాగరాజ్, నేతలు రవీంద్ర జాలదార్, నరసింహులు, ఆంజనేయ, శ్రీనివాసరెడ్డి, కమిషనర్ జుబిన్ మహాపాత్రోలున్నారు.
దొంగ అరెస్ట్.. 5 బైక్‌లు స్వాధీనం
హుబ్లీ: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ధార్వాడ తాలూకా కణవి హొన్నాపురకు చెందిన కన్మేష్ ధార్వాడ (23) నిందితుడు కాగా అతడి నుంచి రూ.2.93 లక్షల విలువ చేసే 5 బైక్‌లను జప్తు చేశారు. జిల్లాలోని కలఘటిగి పట్టణంలోని బొమ్మిగట్టి క్రాస్ దగ్గర అనుమానాస్పదంగా బైక్‌పై తిరుగుతుండగా పోలీసులు వెంటాడి హన్నెరడు మఠం దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సీఐ శ్రీశైల కౌజలిగి నేతృత్వంలో ఎస్‌ఐ కరిబీరప్పనవర, సిబ్బంది మహంతేష్ నానగౌడర, గోపాల పిరగి, ఎలెగార, మల్లికార్జున కార్యాచరణలో పాల్గొన్నారు.

అప్పు తిరిగిమ్మన్నందుకు..

అప్పు తిరిగిమ్మన్నందుకు..