బళ్లారిటౌన్: కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్) పార్టీ భీమోత్సవ సమావేశాన్ని ఈ నెల 14న రాఘవ కళామందిరంలో ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు పాయ గణేష్ తెలిపారు. బుధవారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి పురస్కరించుకొని మొదటి సారిగా బళ్లారి నగరంలో డివిజన్ స్థాయి భీమోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో బళ్లారి జిల్లాతో పాటు విజయనగర, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్నందున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమలు చేసిన రాజ్యాంగం ప్రకారం మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సరైన సదుపాయాలు అందటం లేదన్నారు. రిజర్వేషన్ ఉన్నా రాజ్యాంగ బద్ధంగా పలు పథకాలు కాని ఉద్యోగాలు కాని దక్కడం లేదన్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు ఆ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రవి కృష్ణారెడ్డి, రాష్ట్ర నేతలు రఘు జడిగేరి, దీపక్, ఆశా వీరేశ్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ నేతలు సంతోష్‌కుమార్, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.