
మండ్యలో చైన్ స్నాచింగ్
మండ్య: బైకులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు రోడ్డు మీద నడిచి వెళుతున్న మహిళ మెడలో ఉన్న బంగారం చైన్‌ను లాక్కొని పారిపోయారు. మండ్య నగరంలోని కళ్ళహళ్ళి ఎపిఎంసి వద్ద సోమవారం ఉదయం జరిగింది. స్థానికురాలు సీ.ఎస్.కావ్యశ్రీ కూరగాయలు తీసుకుని నడుచుకుంటూ వస్తుండగా, బైకులో వేగంగా వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బరువైన చైన్‌ను లాక్కెళ్లారు. దీని విలువ రూ. 1.75 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు బైక్‌లో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.
పోకిరీ అరెస్టు
యశవంతపుర: రోడ్డుపై యువతిని వేధించిన పోకిరీని సుద్దగుంటెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కేరళలో ఉండగా పట్టుకున్నారు. వివరాలు.. బెంగళూరు తిలక్‌నగర లేఔట్‌లో నివాసం ఉన్న యువతి ఏప్రిల్ 3న తెల్లవారుజామున 2 గంటల సమయంలో మరో యువతితో కలిసి సుద్దగుంటపాళ్య భారతీ లేఔట్‌లోని ఫస్ట్ క్రాస్‌లో నడిచి వెళ్తోంది. ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకుని గోడకు నెట్టి లైంగికంగా వేధించాడు. కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. నిందితుడు కారు షోరూంలో డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తేలింది. కేరళలో అరెస్టు చేసి తరలించినట్లు ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా తెలిపారు.
బీడీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
యశవంతపుర: బాగా చదవలేకపోతున్నాను, పరీక్షలు రాయలేను అనే భయంతో దంత వైద్య విద్యార్థిని అత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. రాజాజీనగరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీడీఎస్ రెండో ఏడాది చదువుతున్న సౌమ్య గణేశ్ (20) మృతురాలు. ఆదివారం సాయంత్రం హెబ్బాళలోని తమ అపార్టుమెంటు 5వ అంతస్తు నుంచి దూకడంతో గాయాలతో చనిపోయింది. పరీక్షలు సరిగా రాయలేనేమో అనే భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆమె ఆదుర్దాను గుర్తించి 15 రోజుల క్రితం తల్లిదండ్రులు ఇంటి వద్ద కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ భయం వీడలేదు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
కాంగ్రెస్‌ది కపట నాటకం
శివాజీనగర: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేంద్ర సర్కారు మీద పోరాటానికి సిద్ధం కావడం కపట నాటకమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. సోమవారం బెంగళూరులో మాట్లాడారు. కాంగ్రెస్‌వారు కేంద్రానికి వ్యతిరేకంగా 17న ధర్నా చేస్తారట, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ధరలు పెరుగుతున్నాయి, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమన్నారు. పెట్రోల్, డీజల్ ధరలను పెంచి ఇప్పుడు పోరాటం చేసేందుకు నైతిక హక్కు లేదని అన్నారు.

మండ్యలో చైన్ స్నాచింగ్