
కుటుంబ గొడవలా, బయటివారా?
దొడ్డబళ్లాపురం: మాజీ డాన్ కుమారునిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన బెంగళూరు చుట్టూ చాపకింద నీరులా సాగుతున్న మాఫియా కార్యకలాపాలకు అద్దంపట్టింది. ఒకప్పటి మాఫియా నేరగాడు దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై (38) పై కాల్పులు జరిపిన ఘటన బెంగళూరు సమీపంలో రామనగర తాలూకా బిడదిలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బిడదిలోని ఇంటి సమీపంలో కాల్పులు జరిగాయి. కారులో వెళ్తుండగా మాటువేసిన దుండగుడు కాల్పులు చేయగా వెనుక సీట్లో కూర్చున్న రిక్కీ చేయి, ముక్కు, భుజాలకు గాయాలయ్యాయి.
దాడి ఇలా జరిగింది
2 రోజుల క్రితమే రష్యా నుంచి వచ్చిన రిక్కీ రై రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో బిజీగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి నల్ల ఫార్చూనర్ కారులో బెంగళూరుకు రావడానికి బిడదిలోని ఇంటి నుండి బయల్దేరాడు, గేట్ నుంచి ఓ వంద మీటర్లు రాగానే పొంచి ఉన్న దుండగుడు తుపాకీతో గుండ్లు కురిపించాడు. సాధారణంగా రిక్కీ రై ఎప్పుడూ తానే డ్రైవ్ చేస్తాడు. అయితే ఇప్పుడు మాత్రం వెనుక సీట్లో గన్ మ్యాన్‌తో కలిసి కూర్చున్నాడు. డ్రైవర్ బసవరాజు కాల్పుల శబ్దం వినగానే కిందకు వంగిపోయాడు. 70ఎంఎం షాట్ గన్‌తో కాల్చడం వల్ల తూటా కారు డోర్ కు తగిలి డ్రైవర్ సీట్ కుషన్‌ను చీల్చుకుని వెనుక సీట్ డోర్‌కు తగిలింది. తూటాలు తగిలి రిక్కీ రై కి ముక్కు ఛిద్రమైంది. అలాగే కుడి చేయి జబ్బ వెనుక తూటా దిగబడింది. డ్రైవర్, గన్‌మ్యాన్ సురక్షితంగా బయటపడ్డారు. రిక్కీ రై బెంగళూరులో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నాడు.
ముమ్మరంగా రెక్కీ?
శత్రువులు రిక్కీ కదలికలపై లోతుగా నిఘా ఉంచినట్లు వెల్లడవుతోంది. షూటర్ ఓ కాంపౌండ్ గోడ వెనుక నుంచి రంధ్రం ద్వారా కాల్చాడని అనుమానాలున్నాయి. అంత పకడ్బందీగా కాల్పులు జరిపారంటే చాలారోజులుగా రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రిక్కీ రై ఆ సమయంలోనే బయటకు వస్తాడని ఎవరు సమాచారం ఇచ్చారు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు చంపాలనుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపింది షార్ప్ షూటర్లేనని తెలుస్తోంది.
పలువురిపై ఫిర్యాదు
హత్యాయత్నానికి సంబంధించి కారు డ్రైవర్ బసవరాజు... రిక్కీ రై మొదటి భార్య అన్నపూర్ణ, ముత్తప్ప రై మరో భార్య అనురాధ, రై ప్రత్యర్థి రాకేశ్ మల్లి, మరో రియల్ ఎస్టేట్ కంపెనీపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఈ హత్యాయత్నం జరిగిందని డ్రైవర్ బసవరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బిడది పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలిలో రెండు బుల్లెట్లు, ఒక మొబైల్‌ఫోన్ లభించినట్టు సమాచారం. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది పలు సాక్ష్యాధారాలను సేకరించారు.
మాజీ డాన్ ముత్తప్ప రై కొడుకు
రిక్కీ రై పై దాడి
బెంగళూరుకు వస్తుండగా
కారు మీద ఫైరింగ్
తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు
బిడది నివాసం వద్ద అర్ధరాత్రి సంఘటన
2020లో మాజీ డాన్ ముత్తప్పరై చనిపోయాక ఆయనకు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల ఆస్తి పంపకాల్లో వివాదాలు నెలకొన్నాయి. ముత్తప్పరై తన ఇద్దరు కుమారులైన రాకి రై, రిక్కీ రై, రెండవ భార్య అనురాధ, ఇతరులకు తన ఆస్తి ఎంతెంత రావాలన్నది వీలునామా రాశారు. అయితే అనురాధ తనకు ఎక్కువ భాగం ఆస్తి రావాలని కోర్టులో కేసు వేసింది. ఈ 2024లో రాజీ చేసుకుని పరిష్కరించుకున్నారు. ఆస్తి పంపకాల గొడవలతో దాడి జరిగిందా, లేక రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల జరిగిందా అనేది విచారణ సాగుతోంది. గతంలో ముత్తప్ప రై వల్ల దెబ్బతిన్నవారు పగ తీర్చుకోవాలనుకున్నారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. రామనగర ఎస్పీ శ్రీనివాస్‌గౌడ ఆధ్వర్యంలో దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

కుటుంబ గొడవలా, బయటివారా?

కుటుంబ గొడవలా, బయటివారా?

కుటుంబ గొడవలా, బయటివారా?

కుటుంబ గొడవలా, బయటివారా?

కుటుంబ గొడవలా, బయటివారా?