అతుల్‌.. అంతులేని ఆవేదన | Bengaluru Techie Atul Subhash Case: Selfie Video On Abuse Of Wife And Family, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Atul Subhash Case: అతుల్‌.. అంతులేని ఆవేదన

Published Fri, Dec 13 2024 8:35 AM | Last Updated on Fri, Dec 13 2024 9:56 AM

Bengaluru Techie Atul Subhash Case

భార్య కుటుంబీకుల వేధింపులపై సెల్ఫీ వీడియో  

అతనికి నెటిజన్ల మద్దతు  

టెక్కీ ఆత్మహత్య కేసులో యూపీకి బెంగళూరు పోలీసులు  

బనశంకరి: భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్‌ సుభాష్‌ (34) కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు తీవ్రతరం చేశారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్‌ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ ను విచారణ చేపట్టారు. మృతుని సోదరుడు బికాస్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి ఠాణాలో ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటారు.  

రూ.3 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి  
భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి కేసు పెట్టడంతో ఆవేదన చెందిన అతుల్‌ ఈ నెల 9వ తేదీన మారతహళ్లి మంజునాథ లేఔట్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. సుమారు 40 పేజీల డెత్‌నోట్‌ రాశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అతుల్, నిఖితలకు 2019లో వివాహమైంది. ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో ఆమె తప్పుడు కేసు పెట్టిందని అతుల్‌ తన డెత్‌నోట్‌లో ఆరోపించాడు. 4 ఏళ్ల కుమారుడు ఉండగా, అతన్ని కలవాలంటే రూ.30 లక్షలకు డిమాండ్‌ పెట్టారు. అంతేగాక కోర్టు విచారణకు వచ్చినప్పుడు కేసులు వాపస్‌ తీసుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వు, లేకపోతే  చచ్చిపో అని భార్య, బంధువులు దూషించారు.  దీంతో మానసికంగా శారీరకంగా కుంగిపోయిన అతుల్‌సుబాష్‌  ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని సోదరుడు బికాస్‌కుమార్‌  పిర్యాదులో పేర్కొన్నారని వైట్‌ఫీల్డ్‌ విభాగ డీసీపీ డాక్టర్‌ శివ కుమార్‌ గుణారే తెలిపారు.  

సెల్ఫీ వీడియోలో ఆక్రోశం  
ఆత్మహత్యకు ముందు అతుల్‌ రికార్డు చేసిన 90 నిమిషాల సెల్ఫీ వీడియో అతని బాధలను కళ్లకు గట్టింది. భార్య నిఖితా, ఆమె కుటుంబసభ్యులు పెట్టిన వేధింపుల గురించి వివరించాడు. ఏ తప్పు లేకపోయినా తనపై 9 కేసులు బనాయించారని తెలిపాడు. తనకు న్యాయం జరగకపోతే చితాభస్మాన్ని కోర్టు ఎదురుగా ఉన్న డ్రైనేజీలో పడేయాలని వీడియోలో కోరాడు. వందలాది మంది నెటిజన్లు అతుల్‌కు అండగా నిలిచారు. దేశంలో వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, వాటిని సంస్కరించకపోతే మరింతమంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటారని విమర్శలు గుప్పించారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement