డ్రైవరన్నా.. చలో సిరిసిల్ల..! | - | Sakshi
Sakshi News home page

డ్రైవరన్నా.. చలో సిరిసిల్ల..!

Jun 26 2023 12:24 AM | Updated on Jun 26 2023 8:48 AM

సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌ - Sakshi

సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌

ఖమ్మం: హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన డ్రైవర్లు రెన్యూవల్‌ చేసుకోవడం భారమవుతోంది. గతంలో ఎక్కడికక్కడ రవాణా శాఖ కార్యాలయంలో లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసేవారు. కానీ గత మే నెల నుంచి రెన్యూవల్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌(టీఐడీఈఎస్‌)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ సర్టిఫికెట్‌ జారీకి శిక్షణ కేంద్రం రాష్ట్రం మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రమే ఉంది. దీంతో కనీసం రెండు రోజులు కేటాయిస్తే తప్ప అక్కడకు వెళ్లి వచ్చే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్లు వ్యయప్రయాసలకు లోనవుతున్నారు.

రాష్ట్రమంతటా ఒకటే ట్రాక్‌
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌(టీఐడీఈఎస్‌)ను ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మించటంతో డ్రైవర్‌కు ఒకరోజు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై డ్రైవింగ్‌లో మెళకువలు, సిగ్నలింగ్‌ సిస్టమ్‌పై శిక్షణ ఇస్తారు. ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా జాతీయ రహదారిపై ఎంత వేగంగా వాహనం నడపాలో వివరించి టీఐడీఈఎస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

ఈ సర్టిఫికెట్‌ ఉంటేనే హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యూవల్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో దీనిని పెద్దగా పరిగణనలోకి తీసుకోకున్నా ఈ ఏడాది మే నెల నుంచి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో రాష్ట్రమంతటా హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారు తప్పనిరిగా సిరిసిల్ల వెళ్లాల్సి వస్తోంది. వాస్తవానికి ఇది మంచి కార్యక్రమనే ప్రశంసలు వస్తున్నా.. దూరం కావటం వల్లే డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా, కొత్త హెవీ లైసెన్సులు మాత్రం ఎక్కడికక్కడ ఎంవీఐ కార్యాలయాల్లోనే జారీ చేస్తున్నారు.

సిరిసిల్ల వెళ్లాలంటే..
రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు టీఐడీఈఎస్‌ సర్టిఫికెట్‌ కోసం సిరిసిల్ల వెళ్లాల్సి రావడం దూరాభారమేనని చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రైవర్లను తీసుకుంటే సరైన రవాణా సౌకర్యం లేక ఒక రైలు, ఒక బస్సు లేదంటే రెండు బస్సులు మారాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆ ప్రాంతం కొత్తది కావటంతో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండగా.. కనీసం రూ.3 వేలకు పైగా వ్యయమవుతోంది. ఇక సిరిసిల్ల ట్రాక్‌ వద్ద రోజుకు కేవలం 300 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే అవకాశం ఉండడంతో డ్రైవర్లు అక్కడికి వెళ్లాక ఎప్పుడు పిలుస్తారో తెలియక పడిగాపులు పడాల్సి వస్తోంది.

మినహాయింపు ఇవ్వండి..
రెండు, మూడు జిల్లాలు కలిపి వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ను నిర్మిస్తే తమకు అందుబాటులో ఉంటుందని డ్రైవర్లు అంటున్నారు. సిరిసిల్ల దూరాభారం కావడంతో కొత్తగా మరిన్ని డ్రైవింగ్‌ ట్రాక్‌లు అందుబాటులోకి వచ్చే వరకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌కు టీఐడీఈఎస్‌ సరిఫికెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డ్రైవర్లు, లారీ యజమానుల నుంచి డిమాండ్‌ వస్తోంది. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు కలిగిన వారు సుమారు 20వేల మంది ఉంటారనేది అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement