ఇంకా ఆమడదూరంలోనే...
● జిల్లాలోని మార్కెట్ల పన్నుల లక్ష్యం రూ.63.94 కోట్లు ● ఇప్పటి వరకు వసూలైంది రూ.44.70 కోట్లే ● సీజన్ ముగుస్తున్నా లక్ష్యసాధనలో వెనుకబాటు
ఖమ్మంవ్యవసాయం: ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరినా మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాల సాధనలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు దూరంగానే ఉన్నాయి. వానాకాలం పంటల సీజన్ పూర్తవుతున్నా పన్నులు ఇంకా భారీగా మిగిలి ఉండడం గమనార్హం. జిల్లాలో ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లు, వీటి పరిధిలో 21 చెక్‌పోస్టులు ఉన్నాయి. ఎనిమిది మార్కెట్లకు గాను ఈ ఆర్థిక సంవత్సరం రూ.54.35 కోట్ల లక్ష్యంతో పాటు బకాయిలు కలిపి రూ.63.94కోట్ల మేర వసూలు చేయాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటివరకు రూ.44.70కోట్ల(69.91 శాతం) మాత్రమే వసూలైంది.
ఇంకో నెల మాత్రమే గడువు
పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరేందుకు ఇంకా నెల మాత్రమే గడువు ఉంది. ఈ సమయంలో రూ.19కోట్ల మేర వసూలు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. గత ఏడాది యాసంగి నుంచి ఈ ఏడాది వానాకాలం పంటల సీజన్ వరకు మార్కెట్లలో పంటల క్రయ విక్రయాలపై వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంది. కాగా, జిల్లాలోని కల్లూరు మార్కెట్ 86.68 శాతంతో ముందంజలో ఉండగా, మద్దులపల్లి మార్కెట్ 56.82 శాతంతో చివరి స్థానాన నిలిచింది. మిగిలిన మార్కెట్లు 60 నుంచి 80 శాతం వరకు పన్నులు వసూలు చేశాయి. ఇక రాష్ట్రంలోనే పెద్దదైన ఖమ్మం మార్కెట్ బకాయిలతో కలిపి రూ.30కోట్లలో రూ.19.70 కోట్ల వసూలు కాగా ఇంకా రూ.10కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది.
సీసీఐ, పౌరసరఫరాల నుంచి..
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేలా పలు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం, కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ఈ రెండు సంస్థలు కొనుగోలు చేసిన పంటల విలువలో ఒక శాతం పన్ను మార్కెటింగ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాత బకాయిలు కొంత మేరకు చెల్లించినా ఇంకా వసూలు కావాల్సి ఉంది. ఈ పన్నులు కూడా జమ అయితే లక్ష్యసాధనలో కొంత పురోగతి కనిపిస్తుందని చెబుతున్నారు.
గడువులోగా లక్ష్యాన్ని చేరతాం..
మార్కెట్ ఫీజుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. బకాయి ఉన్న ఏజెన్సీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ట్రేడర్లు కొనుగోలు చేసిన పంటలకు సంబంధించి బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లక్ష్యం మేర పన్నులు వసూలు చేస్తాం.
– ఎం.ఏ.అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
మార్కెట్ల వారీగా పన్నుల లక్ష్యం వివరాలు (రూ.లక్షల్లో)
మార్కెట్ లక్ష్యం వసూలు శాతం
కల్లూరు 567.38 491.80 86.68
వైరా 673.58 533.66 79.23
సత్తుపల్లి 494.79 388.67 78.55
మధిర 475.19 352,82 74.25
నేలకొండపల్లి 378.34 260.38 68.82
ఖమ్మం 3,002.85 1,970.16 65.61
ఏన్కూరు 487.70 293.97 60.28
మద్దులపల్లి 315.10 179.04 56.82
మొత్తం 6,394.93 4,470.50 69.91
మార్కెటింగ్ శాఖ ప్రత్యేక దృష్టి
ఆర్దిక సంవత్సరం ముగియవస్తుండడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. మార్కెట్ కమిటీల కార్యదర్శులతో అధికారులు తరచుగా సమీక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. ఇదే సమయాన పంటల విక్రయాలు జరుగుతున్నా లక్ష్యాన్ని చేరకపోవడంపై పలు మార్కెట్ల అధికారుల నుంచి వివరణ అడిగినట్లు సమాచారం. నిర్దేశిత గడువులోగా మార్కెట్లు, చెక్‌పోస్టులతో పాటు గోదాంల నుంచి రావాల్సిన పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
ఇంకా ఆమడదూరంలోనే...
Comments
Please login to add a commentAdd a comment