● స్టాంప్ పేపర్ల విలువపై అదనపు వసూళ్లు ● రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తీరుపై విమర్శలు
ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగుల అవినీతిపై ఆరోపణలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా అడ్డుకట్ట పడడం లేదు. పలువురు ఏసీబీకి చిక్కినా, కొందరిని బదిలీ చేసినా మిగతా ఉద్యోగులు తమ దందా ఆపడం లేదని తెలుస్తోంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కమీషన్లు అడుగుతున్నారన్న విమర్శలు ఉండగా.. ఇప్పుడు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది మరో అడుగు ముందుకేశారు. స్లాంటప్ పేపర్లు తీసుకెళ్లే లైసెన్సు వెండర్లను వదలకుండా కమీషన్ వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
క్రయవిక్రయాల్లో అవసరం
పలు అగ్రిమెంట్లతో పాటు ఆస్తులు, భూముల క్రయవిక్రయాల సమయాన రెవెన్యూ స్టాంపు పేపర్లను వినియోగిస్తుంటారు. వీటిని రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ వెండర్ల ద్వారా విక్రయిస్తోంది. ఇందుకోసం పలువురు లైసెన్సు పొంది కార్యాలయం ద్వారా తీసుకునే స్టాంప్ పేపర్లను ప్రజలకు విక్రయిస్తుంటారు. ఇందుకోసం వీరికి కమీషన్ వస్తుంది. అయితే కొందరు స్టాంప్ వెండర్లు అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉండగా.. ఎలాగూ ఎక్కువకే అమ్ముతున్నందున అందులో కొంత వాటా తమకు చెల్లించాలని ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. స్టాంప్‌ల అమ్మకంపై వెండర్లకు 5శాతం కమీషన్ అందుతుంది. అయితే, రూరల్ కార్యాలయ సిబ్బంది ఈ కమీషన్ ఇవ్వకపోగా అదనంగా 10 శాతం వసూలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఓ స్టాంప్ వెండర్ రూ.15వేల విలువైన రూ.20, రూ.100 స్టాంప్ పేపర్లు కొనుగోలు చేయగా.. రూ.1,500 అదనంగా తీసుకున్నారని తెలిసింది. కార్యాలయంలోనే అదనంగా వసూలు చేస్తున్నప్పుడు తాము మరింత ఎక్కువగా విక్రయించక తప్పడం లేదని వెండర్లు చెబుతున్నారు. ఈవిషయమై ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణను వివరణ కోరగా స్టాంపు పేపర్లపై అదనంగా డబ్బు తీసుకుంటున్నారనే అంశంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకోవడమేకాక అదనంగా తీసుకున్న నగదు తిరిగి ఇపిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment