డబుల్ దందా..
పెరుగుతున్న నకిలీ డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు
● ధనార్జనే ధ్యేయంగా పలువురు రియల్టర్ల అడ్డదారులు ● రిజిస్ట్రేషన్ల శాఖలో వంత పాడుతున్న కొందరు అధికారులు ● ఫలితంగా భూయజమానుల్లో ఆందోళన
జిల్లాలోని పలుచోట్ల ఇళ్ల స్థలాలు, విల్లాలు, ఇళ్ల డబుల్ రిజిస్ట్రేషన్ల దందా ఇటీవల
పెరిగింది. కొందరు రియల్టర్లు అక్రమార్జనకు అలవాటు పడి ఈ బాట పడుతున్నారు.
కొణిజర్ల మండలం ఇండోఖతార్‌లో డబుల్ రిజిస్ట్రేషన్ల
వ్యవహారం వెలుగుచూడగా వైరా సబ్ రిజిస్ట్రార్‌తో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదైంది. తాజాగా తప్పుడు
డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముగ్గురిపై ఆదివారం ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు రియల్టర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుండగా,
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పలువురు వీరి వలలో చిక్కుకుని కేసుల
పాలవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
కార్యాలయాల్లో ఎలా?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కొందరు మాయగాళ్ల వలలో చిక్కుకుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. అన్ని పత్రాలను పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెబుతున్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో సస్పెన్షన్‌కు గురవుతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్లపై పూర్తి అవగాహన ఉన్నా ప్రలోభాలకు లొంగుతున్నారనే చర్చ జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు 64 ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగగా, విచారణ అనంతరం వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొణిజర్లతోపాటు అమ్మపాలెం, లింగగూడెంలో డిసెంబర్ 28న గ్రీన్ ల్యాండ్ డెవలపర్స్ యజమానులు ఒకేరోజు 64 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించారు. వీటిలో గతంలోనే కొందరు కొనుగోలు చేసిన 80, 108, 134, 135 నంబర్ విల్లాలను సైతం ఈ సమయాన ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా అక్రమంగా జరిగాయని నిర్ధారించారు. దీంతో వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు, తొమ్మిది మందిపై కేసు నమోదైంది.
డబుల్ మాయ
రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయానికి ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేదా అని పరిశీలిస్తున్నారు. అయితే, గతంలో ఆ భూమికి రిజిస్ట్రేషన్ జరిగిందా అన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న కేటుగాళ్లకు ఒకే భూమిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయించడం సులువవుతోంది. వివాదాస్పద భూములకు ఇలా రెండేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తుండడం.. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో భూయజమానులు కలవరానికి గురవుతున్నారు.
ఇదే వ్యాపారంగా..
జిల్లాలో కొందరు డబుల్ రిజిస్ట్రేషన్లతోపాటు తప్పుడు డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. భూములు లేకపోయినా తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేయడం పరిపాటిగా మారింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిన నేపథ్యాన రియల్టర్లు అక్రమార్జనకు అలవాటు పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టించి, వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక డాక్యుమెంట్ల ఆధారంగా రుణాలు ఇప్పిస్తూ కమీషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇలాగే వ్యవహరించిన మధురానగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు షేక్ బడేసాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్‌కుమార్‌పై ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
నాలుగు సార్లు రిజిస్ట్రేషన్
ఖమ్మం నగర అభివృద్ధితో శివారులోని మధురానగర్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే ఇక్కడ భూమి లేకున్నా ఒకే సర్వే నంబర్‌పై నాలుగు సార్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తప్పుడు డాక్యుమెంట్లతో ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో అక్రమార్కుల బండారం బయటపడింది. అయితే, ఈ విషయాన్ని రిజిస్ట్రేషన్ సమయాన అధికారులు ఎందుకు గుర్తించలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ తెలిసినా అధికారులు అక్రమార్కులకు వంత పాడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తుండడంతో త్వరలోనే సూత్రధారులెవరో తేలే అవకాశముంది.
డబుల్ దందా..
Comments
Please login to add a commentAdd a comment