సర్వం సన్నద్ధం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం మొదలుకానున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయగా ఎక్కడి నుంచైనా అధికారులు పర్యవేక్షించేందుకు వీలు కలగనుంది. అటు హైదరాబాద్, ఇటు జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసీ సీసీ కెమెరాల పుటేజీని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. పరీక్ష కేంద్రం సామర్థ్యం ఆధారంగా ఐదు నుంచి పది వరకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
గంట ముందు నుంచే అనుమతి
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో 72కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 35 ప్రైవేట్ కళాశాలలు, ఒక ప్రైవేటు పాఠశాల, రెండు ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు 34 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 36,660మంది పరీక్షలు రాయనున్నారు. కాగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,783 మందిలో జనరల్ 15,579మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,204మంది ఉన్నారు. ఇక ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,877మందిలో 16,632మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,245మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా విద్యార్థులను 8గంటల నుంచే అనుమతిస్తామని తెలిపారు.
పకడ్బందీగా జరిగేలా..
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైపవర్ కమిటీ(హెచ్‌సీపీ), జిల్లాఎగ్జామినేషన్ కమిటీ(డీఈసీ)లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్షల నిర్వహణకు నియమించిన 835మంది ఇన్విజిలేటర్లలో 300మంది అధ్యాపకులు, 535మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 36,600మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటుచేశాం. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. హాల్ టికెట్ నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఒకరోజు ముందుగానే కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకుని నిర్ణీత సమయానికి కంటే ముందుగానే చేరుకుని పరీక్ష ప్రశాంతంగా రాయాలి.
– కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
కేంద్రాన్ని గుర్తించేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్
సెంటర్ సులువుగా తెలిసేలా...
విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేయగా ఇంకా అందని వారు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు tgbie. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్ తీసుకోవచ్చని అధికారులు సూచించారు. అంతేకాక సెంటర్ సులువుగా తెలిసేలా హాల్‌టికెట్‌పై సెంటర్ చిరునామాతో కూడా క్యూఆర్ కోడ్‌ను తొలిసారిగా ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సెంటర్ చిరునామా గూగుల్ మ్యాప్ వస్తుందని అధికారులు తెలిపారు.
జిల్లాలో పరీక్షల వివరాలు...
చీఫ్ సూపరింటెండెంట్లు 72మంది
డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు 72మంది
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 03
సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 05
పరీక్షా కేంద్రాలు 72
విద్యార్థులు 36,660
సర్వం సన్నద్ధం
సర్వం సన్నద్ధం
సర్వం సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment