సౌర విద్యుత్ ప్లాంట్లు
నాలుగు గ్రామాల్లో
● రెండు జిల్లాల్లో రెండేసి గ్రామాల ఎంపిక ● మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్ చొప్పున ప్లాంట్లు ● మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న శంకుస్థాపన
ఖమ్మంవ్యవసాయం: ప్రధాన మంత్రి కుసుమ్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుండగా, వ్యక్తిగతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీలు అందిస్తోంది. అలాగే, బంజరు, బీడు భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తున్నారు. ఇదే సమయాన మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారి ఆధ్వర్యాన ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి జిల్లాలో నాలుగు
పైలట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాల ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలోని మధిర మండలం మడుపల్లి, కల్లూరు మండలం చిన్నకోరుకొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేనిగుంపు గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం నాలుగెకరాల చొప్పున భూమి, నిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. ఇప్పటికే స్థలాలు ఖరారైనందున నివేదికలను రెడ్‌కో సంస్థ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు.
8న శంకుస్థాపన
రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు మహిళా దినోత్సవమైన ఈనెల 8న శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనుండగా, గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశముంది.
ఈ వారంలోనే శంకుస్థాపన
మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏర్పాట్లు చేశాం. ఉమ్మడి జిల్లాలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు ప్లాంట్లు తొలిదశలో ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాం. ఈ వారంలో శంకుస్థాపన జరిగే అవకాశముంది.
– పోలిశెట్టి అజయ్‌కుమార్, రెడ్‌కో మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment