
‘తాయిలం’ అందేనా ?
● ప్రతి ఏటా రామాలయంపైనే ఉత్సవాల భారం ● నిర్వహణ ఖర్చులకు హుండీ ఆదాయమే మార్గం ● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
భద్రాచలం: భద్రగిరి రామయ్యకు సర్కారు తాయిలం అందడం లేదు. ప్రతీ ఏడాది ఉత్సవాల సమయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా నిరుత్సాహమే మిగులుతోంది. దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారం అవుతుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చివరికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే దిక్కుగా మారడంతో ఆ నిధులనే ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆలయ అభివృద్ది కుంటుపడుతోందని ఇటు భక్తులు, అటు అధికారులు ఆవేదన చెందుతున్నారు.
నవమి వ్యయం రూ.2 కోట్లకు పైగానే..
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో ముక్కోటి, శ్రీరామనవమి ముఖ్యమైనవి. వీటితో పాటు భక్తరామదాసు జయంతి ఉత్సవాలనూ ఘనంగా నిర్వహిస్తారు. అయితే వీటిలో ముక్కోటి సందర్భంగా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, శ్రీరామనవమి వేడుకలకు భక్తులు భారీగా హాజరవుతుంటారు. ఆ సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం వందల సంఖ్యలో ఉంటారు. కాగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వస్తువుల ధరలు, వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు పెరుగుతుండగా ఏటేటా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతోంది. గతంలో రూ. కోటి – కోటిన్నర మధ్యలో ఖర్చు కాగా, ఈ ఏడాది రూ.రెండు కోట్లకు పైగానే అవసరమని అధికారులు అంటున్నారు. వీటిలో ఉత్సవ నిర్వహణ పనులకు రూ.కోటిన్నర, క్రతువు నిర్వహణ, తలంబ్రాలు, పట్టువస్త్రాలు, ఇతర ఖర్చులకు మరో కోటి వరకు ఖర్చవుతుందని అనధికారికంగా చెబుతున్నారు. ముక్కోటికి సైతం రూ.కోటిన్నర వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా.
ఖర్చులకు కానుకలే దిక్కు..
భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అందే సాయం మాత్రం రూ.15వేలు మాత్రమే. అది కూడా పేపర్లపై లెక్కలు చూపడం మాత్రమే. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. నవమి వేడుకలకు సాయం అందించాలని అటు అధికారులు, ఇటు భక్తులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేదు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు అందించే స్థాయిలో కాకున్నా భక్తుల మనోభావాలను గౌరవించి ఉత్సవాల నిర్వహణకు ఎంతో కొంత అందించాలని పలువురు కోరుతున్నారు. కాగా హుండీల ద్వారా భక్తులు సమర్పించే కానుకలనే ఉత్సవాల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గతం కంటే ఆదాయం పెరిగినా ఆలయ అఽభివృద్ధికి, భక్తులకు మరింతగా వసతుల కల్పనకు వెచ్చించాల్సిన నిధులను ఉత్సవాల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. భద్రాచలంలో భక్తులకు వసతి కష్టాలు నిత్యం ఎదురవుతుంటాయి. ఆలయానికి వచ్చే ఆదాయంతో రంగనాయకుల గుట్ట మీద, కింద దేవస్థానం భూముల్లో డార్మెటరీ, 100 గదుల వసతి గృహాలను నిర్మిస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ సర్కారైనా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణకు ఒక్క పైసా విదల్చలేదు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామన్న హామీని సైతం విస్మరించింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారైనా నిధులు ఇవ్వకపోతుందా అని భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాలకు నిధులు కేటాయిస్తుందని భావించినా విడుదల చేయలేదు. ఈ ఏడాదైనా రామయ్యపై కరుణ చూపేనా అని భక్తులు, అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ ఏడాది హాజరు కావడంతో పాటు ఆలయ అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు.
తక్షణమే సాయం అందించాలి
భక్తుల ఆదాయం భక్తులకే చెందాలి. ఉత్సవాల నిర్వహణ పేరుతో పక్కదారి పట్టించడం సరైంది కాదు. హుండీ ఆదాయాన్ని భక్తుల వసతుల కల్పనకు కేటాయించాలి. ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. వీటికి అయ్యే ప్రతీ పైసా ప్రభుత్వమే భరించాలి.
– బూసిరెడ్డి శంకర్ రెడ్డి,
భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు

‘తాయిలం’ అందేనా ?
Comments
Please login to add a commentAdd a comment