
మనువాదం ప్రజలను పీడిస్తోంది
● ప్రజా పోరాటాల్లో పెద్దన్న రవన్న ● వర్ధంతి సభలో వీపీవీ నేత పట్నాయక్
ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మనువాదం, మార్కెట్ భావజాలం అనే కవల పిల్లలు ప్రజలను పీడిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని విద్యా పరిరక్షణ వేదిక జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్ )మాస్‌లైన్–రవన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాయల సుభాస్ చంద్రబోస్ (రవన్న) 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ సంపదను లూటీ చేసేలా కార్పొరేట్ శక్తులకు పాలకులు సేవ చేస్తున్నారని అన్నారు. పేదలను మరింత బలహీనంగా మారుస్తూ సోమరిపోతులుగా చూస్తున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు మండుతున్నాయని, కోట్లాది కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతుంటే కార్పొరేట్ వర్గాల వారు శత కోటీశ్వరులుగా మారుతున్నారని అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం విద్యుత్, సాగు, తాగునీరు, సేవా రంగం, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉందన్నారు. ప్రముఖ సంపాదకులు సతీష్ చందర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలను పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రిస్తోందన్నారు. మనువాద చాందస భావాలకు వ్యతిరేకంగా సమష్టిగా ఉద్యమించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు కేజీ రామచందర్ మాట్లాడుతూ రవన్న అతివాద, అవకాశవాదాలకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేసి విప్లవోద్యమాన్ని సరైన దిశలో నడిపారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, నాయకులు కెచ్చల రంగయ్య, గుర్రం అచ్చయ్య, కె.రమ, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, ముద్ద భిక్షం, పుసులూరి నరేందర్, చిన్న చంద్రన్న, హన్మేశ్, ఎస్‌ఎల్ పద్మ, ఆవుల వెంకటేశ్వర్లు, సి.వై.పుల్లయ్య జి.రామయ్య, మనోహర్ రాజు, కల్పన, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment