సామాజిక బాధ్యత అవసరమే..
● నగరాల అభివృద్ధిలో కీలకంగా సీఎస్‌ఆర్ ఫండ్ ● పలుచోట్ల ఈ నిధులతోనే పనులు ● ఖమ్మంలోనూ సంస్థలు ముందుకొస్తే ఫలితం
ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక బాధ్యత కలిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలు అందించే ఆర్థిక తోడ్పాటు నగరాభివృద్ధికి అండగా నిలవనుంది. సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) ఫండ్‌తో ఇప్పటికే పలు నగరాల్లో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఆర్థికంగా బలపడి ఆదాయ పన్ను చెల్లించే వారు సీఎస్‌ఆర్ ద్వారా సహకారం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని పూణే వంటి నగరాల్లో అభివృద్ధి తెలియచేస్తోంది. ఇటీవల పూణే నగరంలో కేఎంసీ బృందం పర్యటించిన సమయాన అక్కడి వ్యాపారులు, సంస్థలు, ఆదాయపన్ను చెల్లింపుదారులు పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు సీఎస్‌ఆర్ ద్వారా భారీగా విరాళాలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిధులతో అక్కడి కార్పొరేషన్ అధికారులు ఒక ఆస్పత్రిని నిర్మించడం విశేషం. అంతేకాక నగరంలోని పలు కూడళ్ల సుందరీకరణ, నిర్వహణ పనులు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ నిధులకు తోడుగా...
అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, నగరాల్లో ప్రజల సామాజిక బాధ్యత, భాగస్వామ్యం కీలకంగా నిలుస్తోంది. ఖమ్మంలో ప్రస్తుతం ప్రజలు చెల్లించే పన్నులతో పాటు ప్రభుత్వం మంజూరు చేసే నిధులతోనే అభివృద్ధి పనులను చేపడుతున్నారు. వీటికి తోడు సామాజిక బాధ్యత కలిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలల బాధ్యులు సీఎస్‌ఆర్ ఫండ్ అందజేస్తే మరికొన్ని పనులు వేగంగా చేపట్టేందుకు వీలవుతుంది. పూణే స్టడీ టూర్‌లో కేఎంసీ కార్పొరేటర్లు, అధికారులు సీఎస్‌ఆర్ ద్వారా అందుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. దీంతో ఖమ్మంలోనూ వ్యాపార, వాణిజ్య సంస్థలే కాక కార్పొరేట్ సంస్థలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలు మొదలుపెట్టారు. తద్వారా కేఎంసీకి నిధులు సమకూరి అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఏర్పడడమే కాక ఆయా సంస్థలకు ఆదాయపన్నులో రాయితీ లభించనుంది.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు
సీఎస్‌ఆర్ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు సమకూరితే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పార్క్‌ల అభివృద్ధి, యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్, వాల్ పెయింటింగ్స్ కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం కేఎంసీకి వస్తున్న ఆదాయ పన్ను, ప్రభుత్వం మంజూరు చేసే వివిధ రకాల నిధులు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలకే సరిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిధులు లేక పనులు ఆగిపోయిన సందర్భాలు ఎదురయ్యాయి. వీటన్నింటిని అధిగమించాలంటే దేశంలోని పలు మహానగర పాలక సంస్థలకు అందుతున్న విధంగానే ఖమ్మం నగరానికి సీఎస్‌ఆర్ ఫండ్ వస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది.
అనేక అవకాశాలు
ఖమ్మం నగరానికి చెందిన పలువురు వ్యాపారులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. మున్నేటి వరద వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు స్పందించి ఇటు కలెక్టర్, అటు సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిధులు సమకూరుస్తున్నారు. ఇతర పట్టణాలు, నగరాలతో పోలిస్తే ఖమ్మంలో సామాజికంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం, అవసర సమయాన నిధులను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిని ఒప్పించి కేఎంసీకి సీఎస్‌ఆర్ ఫండ్ సేకరించగలిగితే వారికి యూటీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్) అందుతుంది. తద్వారా ఆదాయ పన్నులో మినహాయింపు లభించనుంది. ఆపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి, సుందరీకరణకు కీలకంగా నిలుస్తారు. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలలు, బంగారు ఆభరణాల షోరూంలు, షాపింగ్‌మాల్స్ ఉన్నందున వీటి ద్వారా నిధులు రాబట్టవచ్చనే భావనకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఆ దిశగా త్వరలోనే కార్యాచరణ మొదలుపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment