పారదర్శకంగా సేవలు అందించాలి
ఖమ్మంసహకారనగర్: నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని టీటీడీసీలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ అంశాలపై ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు చేయాల్సిన విధులు, బాధ్యతలను పక్కాగా నిర్వర్తించేలా శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు, వివిధ పనుల కోసం జారీచేసే మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. భూచట్టాలపై పట్టు సాధించి దరఖాస్తులను పరిష్కరించాలని, భూలావాదేవీల పరిష్కారంలో అవకతవకలకు పాల్పడొద్దని సూచించారు. అంతేకాక కుటుంబం, విధులను సమాంతరంగా నిర్వర్తిస్తే ఇబ్బందులు ఉండవని కలెక్టర్ తెలిపారు. అనంతరం రిటైర్డ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సురేశ్ పొద్దర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు టి.కరుణాకర్‌రెడ్డి, అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఈవీఎం గోదాం తనిఖీ
కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. నియోజకవర్గాల వారీగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన గదుల్లో పరిశీలించి భద్రతపై సూచనల చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ స్వామి, డీటీ అన్సారీ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment