
హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
సత్తుపల్లి/కల్లూరు: ఇంట్లో కష్టాలకు కారణమని నమ్మి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు మంగళవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు, అదే గ్రామానికి చెందిన బంధువు పాడిబండ్ల శివ నడుమ పాతకక్షలు ఉన్నాయి. శివ ఇంట్లో ఎదురవుతున్న సమస్యలు, ఆయన పశువులు చనిపోతున్నాయని నూతలపాటి నారాయణరావు, తల్లాడ మండలం మల్లారానికి చెందిన పాస్తం రంగారావును సంప్రదించగా సమస్యలన్నింటికీ శ్రీనివాసరావు చేస్తున్న పూజలే కారణమని చెప్పారు. దీంతో శ్రీనివాసరావును శివ 2023 ఫిబ్రవరి 19 చెన్నూరు–రంగాపురం రోడ్డుపై కత్తితో నరికి హత్య చేయడంతో శ్రీనివాసరావు భార్య కృష్ణమ్మ కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శివతో పాటు ఆయన తల్లిదండ్రులు రమాదేవి, అర్జున్‌రావు, నారాయణరావు, రంగారావు పై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ అనంతరం ఏ–1 పాటిబండ్ల శివ, ఏ–5 పస్తం రంగారావుపై నేరం రుజువు కాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అబ్దుల్‌పాషా వాదించగా.. అప్పటి, ప్రస్తుత సీఐలు హనూక్, ముత్తులింగయ్య ఎస్సైలు రఘు, హరిత, కానిస్టేబుళ్లు మల్లికార్జున్, సుందరం సహకరించారు. నిందితులకు శిక్ష పడేలా విచారణ చేపట్టి చార్జీషీట్ దాఖలు చేసిన ఏపీపీ అబ్దుల్‌పాషా, పోలీసులను ఖమ్మం సీపీ సునీల్‌దత్ మంగళవారం సత్తుపల్లిలో అభినందించారు.
కష్టాలకు కారణమని నమ్మి
హతం చేసిన వైనం
Comments
Please login to add a commentAdd a comment