పన్నులు వసూలయ్యేదెలా?
● చివరి దశకు చేరిన ఆర్థిక సంవత్సరం ● కేఎంసీలో రూ.33.02 కోట్లకు రూ.24.91 కోట్లే వసూలు ● భారం మోపుతున్నారని బిల్ కలెక్టర్ల నిరసన
ఖమ్మంమయూరిసెంటర్: ఓ వైపు ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరింది. అయినా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆస్తి పన్నుల బకాయిలు భారీగానే ఉన్నాయి. పన్నులు వంద శాతం వసూలు చేసేలా అధికారులు రోజువారీగా లక్ష్యాలను నిర్దేశించి రెవెన్యూ అధికారులు, బిల్‌కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లకు సూచనలు చేస్తుండగా లక్ష్యాల పేరుతో తమను వేధిస్తున్నారని బిల్ కలెక్టర్లు నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఏటా లక్ష్యాలను నిర్దేశించగా సాధారణ ప్రకియేనని అధికారులు చెబుతుండగా, ఈసారి అలా చేయలేమని బిల్లు కలెక్టర్లు చెప్పడం గమనార్హం. దీంతో రానున్న 13రోజుల్లో రూ.8.10 కోట్ల మేర ఎలా వసూలు చేస్తారన్నది ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది.
రూ.24.91 కోట్ల వసూలు
2024–25 ఆర్థిక సంవత్సరంలో మరో 13 రోజులు మాత్రమే ఉంది. కేఎంసీ పరిధిలో 80,348 అసెస్‌మెంట్లకు గాను రూ.33.02 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో రూ.24.91 కోట్లు వసూలవగా, ఇంకా రూ.8.10 కోట్ల మేరబకాయి ఉంది. మిగిలిన సమయంలో ఈ పన్నులన్నీ రాబట్టాలంటే రోజుకు రూ.62లక్షలకు పైగా వసూలు చేయాలి. దీంతో అధికారులు సైతం క్షేత్ర స్థాయికి వెళ్లి బకాయిదారులను కలుస్తున్నారు.
మాపై వేధింపులు
అధికారులు లక్ష్యాలను విధించి పన్నులు వసూలు చేయకపోతే వేతనం కోత వేధిస్తామని, నోటీసులు ఇస్తామంటే బెదిరిస్తున్నారని మంగళవారం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఆందోళనకు దిగారు. అధికారులు కావాలనే ఇలా చేస్తూ తమను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ కేఎంసీ కార్యాలయంలో మిషన్లంటినీ పక్కన పెట్టేశారు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా కార్యాలయానికి చేరుకుని ఆర్‌ఓ శ్రీనివాసరావుతో కలిసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేస్తేనే ఫలితం వస్తుందని నచ్చచెప్పిన ఆయన ఆతర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా లక్ష్యాల మేర పన్నులు వసూలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని చెబితే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన ఆయన.. రానున్న 13 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండి వసూళ్లలో నిమగ్నం కావాల్సిందేనని స్పష్టం చేశారు.
సెలవు ఇప్పించండి.. వెళ్లిపోతా
అధికారులు కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నందున తాము పని చేయలేనని, సెలవు ఇప్పిస్తే వెళ్లిపోతానంటూ ఓ అధికారి.. అసిస్టెంట్ కమిషనర్ ఎదుట ఆందోళనకు దిగాడు. పని చేస్తున్నా చేయడం లేదని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు సెలవులైనా ఇప్పించాలని, లేదంటే మరో పోస్టు కేటాయించాలన్నారు. సదరు అధికారి ఆందోళనతో కేఎంసీ కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా.. రెండు గంటల పాటు జరిగిన వాదనలు కొనసాగుతాయి. చివరకు అసిస్టెంట్ కమిషనర్ సర్దిచెప్పగా ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పన్నుల వసూళ్లకు బయలుదేరారు.
ఏటా మాదిరిగానే లక్ష్యాలు
కేఎంసీలో వేతనాలు, ఇతర ఖర్చులు పెరుగుతున్నందున అదే స్థాయిలో ఆదాయం రాబట్టుకునేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్నుతోనే అత్యధికంగా ఆదాయం సమకూర్చుకునే అవకాశమున్నందున లక్ష్యాలను నిర్దేశించామని వెల్లడించారు. గతేడాది మాదిరే ముందుకు సాగుతున్నన విషయాన్ని సిబ్బందికి వివరిస్తున్నట్లు తెలిపారు.
సమస్యలు ఉంటే సంప్రదించండి..
రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలు ఉంటే నేరుగా తననైనా లేదంటే అసిస్టెంట్ కమిషనర్, ఆర్‌ఓను సంప్రదిందించాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. పన్నుల వసూళ్లపై కార్యాలయంలో మంగళవారం సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఆందోళనకు గురై లక్ష్యసాధనలో వెనుకబడొద్దని తెలిపారు. ఉదయం 7నుంచి రాత్రి 9 గంటల వరకు క్షేత్ర స్థాయిలో ఉంటేనే పన్నులు వసూలవుతాయని చెప్పారు. ఈనెల 31 వరకు రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు ఉండవని, ఆదివారం కూడా వసూళ్లలో నిమగ్నం కావాల్సిందేనని స్పష్టం చేశారు.
పన్నుల వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)
రకం అసెస్‌మెంట్లు లక్ష్యం వసూలు చేసింది బకాయి
రెసిడెన్షియల్ 72,827 18.06 14.35 3.71
కమర్షియల్ 3,720 8.65 6.29 2.36
రెండూ కలిసి ఉన్నవి 3,771 6.31 4.27 2.03
పన్నులు వసూలయ్యేదెలా?
Comments
Please login to add a commentAdd a comment