
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఏఎస్‌ఐ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు
ఖమ్మంక్రైం: ఖమ్మం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతిచెందిన ఎండీ షౌకత్‌అలీ కుటుంబానికి భద్రతా ఎక్స్‌గ్రేషియా ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కును ఆయన కుటుంబీకులకు బుధవారం సీపీ సునీల్‌దత్ అందజేశారు. కార్యక్రమంలో ఏఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
10 మంది స్పౌజ్
ఉపాధ్యాయుల బదిలీ
ఖమ్మంసహకారనగర్: గత ప్రభుత్వ హయాంలో 317 జీఓ ద్వారా ఉపాధ్యాయ దంపతుల్లో ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో వీరికి స్పౌజ్ కేటగిరీ ద్వారా బదిలీకి అవకాశం కల్పించగా రాష్ట్రంలో 165మంది ఉపాధ్యాయులను వారి భాగస్వామి పనిచేస్తున్న జి ల్లాలకు కేటాయించారు. ఇందులో పది మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానుండగా, అంతే సంఖ్య ఉ పాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉత్తర్వులు విడుదల చేయడంపై టీ ఎస్‌యూటీఎఫ్ బాధ్యులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయా ఉపాధ్యాయులు ఈనెల 22న ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి 23న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష
ఖమ్మంలీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం ముద్దులపల్లికి చెందిన ఎటుకూరి లక్ష్మణ్‌రావు వద్ద ఖమ్మం గాంధీచౌక్‌కు చెందిన వ్యాపారి మల్లెల నర్సింహారావు మూడు దఫాలుగా రూ.21 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో 2021 సెప్టెంబర్‌లో రూ.5 లక్షల చెక్కు ఇచ్చినా ఖాతాల్లో సరిపడా నగదు లేక చెల్లలేదు. దీంతో లక్ష్మణ్‌రావు న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం నర్సింహారావుకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక రూ.5 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించారు.
మృతి చెందిన రిటైర్డ్ పోలీస్ కుటుంబాలకు చేయూత
ఖమ్మంక్రైం: వివిధ కారణాలతో మృతి చెందిన విశ్రాంత పోలీస్ అధికారుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు విశ్రాంత అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణమూర్తి, రుద్ర వెంకటనారాయణ బుధవారం తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ చేయూత మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ప్రతీ రిటైర్డ్ ఉద్యోగి నెలకు రూ.300 జమ చేసేలా తీర్మానించామని తెలిపారు. ప్రతాప్‌రెడ్డి, సంజీవరావు, సోమయ్య, నాగేశ్వరరావు, జయాకర్, ఖాసీం, దస్తగిరి, హరిసింగ్, రామచంద్రరాజు, దావీదు, ప్రసాద్ పాల్గొన్నారు.

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం