
సండే.. ఎండలు మండే
● ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతం ● ఎండ తీవ్రతకు ఇళ్లకే పరిమితమైన జనం ● పగటి వేళ రోడ్లన్నీ నిర్మానుష్యం
ఖమ్మంవ్యవసాయం : భానుడు ఉగ్రరూపం దాల్చా డు. నిన్నా మొన్నటి వరకు అకాల వర్షాలతో ఉష్ణోగ్రత కొంతమేర అదుపులోనే ఉన్నా ఆదివారం మాత్రం జిల్లాలో 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా చింతకాని, పమ్మి, బాణాపురంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా గుబ్బగుర్తి, రావినూతల, నాగులవంచ, సత్తుపల్లిలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమవుతుండగా.. 11 గంటల వరకు తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం కొనసాగుతుండగా 6 తర్వాత కొంత మేర చల్లబడుతోంది.
జనం సతమతం..
ఓ వైపు ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతలతో ప్రజ లు సతమతమవుతున్నారు. ఉష్ణోగ్రతలకు తోడు గాలిలో తేమ లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఎండ తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరి మితం అవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వరి, మొక్కజొన్న, మిరప, మామిడి వంటి పంట కోతలకు వెళ్లే కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటికి చేరుకుంటున్నారు. కిరాణ, ఇతర దుకాణాలకు కూడా వినియోగదారులు ఉద యం, సాయింత్రం వేళల్లోనే వెళ్తున్నారు. సాయింత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల్లో రద్దీ ఉంటోంది.
ఆదివారం 40 డిగ్రీలకు పైగానే..
జిల్లాలో గేటు కారేపల్లి, లింగాల, వైరాలో ఆదివారం 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఎర్రుపాలెంలో 42.6, కూసుమంచి 42.1, మధిర 42.0, పెనుబల్లి, నేలకొండల్లి, మధిర ఏఆర్‌ఎస్ 41.7, రఘునాథపాలెం 41.6, ఖమ్మం నగరం ఖానాపురంలో 41.4, కలెక్టరేట్, కాకరవాయిలో 41.2, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్ హౌస్, బచ్చోడు, పల్లెగూడెంలో 41.0, తిరుమలాయపాలెం, ముదిగొండలో 40.9, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 40.7, తల్లాడ, కుర్నవల్లిలో 40.6, సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీ 1, 2, వేంసూరు, సిరిపురంలో 40.5, మంచుకొండ, పెద్దగోపతిలో 40.2, కల్లూరులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.