
రెండు బార్లకు పది దరఖాస్తులు
● ఈనెల 26వ తేదీతో ముగియనున్న గడువు ● ఖమ్మం బార్లపై ఏపీ వ్యాపారుల ఆసక్తి
ఖమ్మంక్రైం: ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మూతపడిన రెండు బార్ల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 26తో ముగియనుంది. ఖమ్మం బస్ డిపో రోడ్డు, నెహ్రూనగర్‌లోని రెండు బార్లకు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ఎనిమి దేళ్ల క్రితం మూతబడ్డాయి. వీటిని కొత్త వారికి అప్పగించేందుకు ఎకై ్సజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 1న మొదలైన పక్రియ 26వ తేదీతో ముగియనుండగా, మంగళవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కానీ అనూహ్యంగా బుధవారం మంచి రోజుగా భావిస్తూ పది మంది దరఖాస్తులు సమర్పించారు. మిగిలిన మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అయితే, ఖమ్మం ఏపీకి సరిహద్దుగా ఉండడంతో ఇక్కడి బార్లను దక్కించుకోవడంపై ఆంధ్రా వ్యాపారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒక బార్‌ను టెండర్లలో దక్కించుకుని మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేయాలనే భావనతో ఇప్పటికే స్థానిక మద్యం వ్యాపారులతో చర్చించినట్లు సమాచారం.
ఈనెల 29వ తేదీన డ్రా
ఖమ్మంలో రెండు బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణకు గడువు 26వ తేదీతో ముగియనుండగా, 29వ తేదీన డ్రా ద్వారా ఖరారు చేస్తామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. రూ.లక్ష చలానాతో పాటు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరిస్తుండగా, డ్రా లో బార్ దక్కకున్నా చలానా నగదు తిరిగి ఇవ్వబోమని వెల్లడించారు. అయితే, దరఖాస్తుల ద్వారా రూ.కోటి మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఖమ్మంలో ప్రస్తుతం 30 బార్లు ఉండగా, కొత్తవి ఏర్పాటైతే ఈ సంఖ్య 32కు చేరనుంది.