
చేప పెరగదు.. కడుపు నిండదు
● కేజీకి మించి బరువు పెరగని జలపుష్పాలు ● ప్రభుత్వ, ప్రైవేట్ సీడ్లు రెండింటి పరిస్థితి అదే... ● నష్టపోతున్నామని మత్స్యకారుల ఆవేదన
రోజంతా వేటాడితే ఎనిమిది కేజీలే..
రిజర్వాయర్‌లో గత 20 ఏళ్లుగా చేపల వేట కొనసాగిస్తున్నా. రోజు మొత్తం షికార్ చేస్తే ఎనిమిది కేజీల చేపలే దొరికాయి. గతంలో రోజు మొత్తం మీద క్వింటాకు పైగా చేపలు లభించేవి. కానీ ఇప్పుడు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
– షేక్ బాబు , మత్స్యకారుడు వైరా
వలలు, తెప్పలకే ఖర్చు
చేపల వేట కోసం అవసరమైన వలలు, తెప్పలు కొనుగోలుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు చేసి చేపల వేటకు వెళ్తే రోజు మొత్తం మీద రూ.500 కూడా రాలేదు. మా పరిస్థితి దయనీయంగా మారింది. – షేక్ ఖాదర్, మత్స్యకారుడు, వైరా
మత్స్యకారులకు నష్టమే...
రూ.10లక్షల విలువైన 14 లక్షల సీడ్ సొంతంగా పోశామని మత్స్యకారులు చెబుతున్నారు. కానీ ఒక్కొక్కరికి పది కేజీల చేపలు కూడా పడడం లేదు. తద్వారా మత్స్యకారులకు నష్టమే. అధికారులు పట్టించుకుంటే న్యాయం జరుగుతుంది. – ఫణితి సురేష్, సొసైటీ సభ్యుడు, వైరా
వైరా: జిల్లాలో పేరున్న వైరా రిజర్వాయర్‌పై ఆధారపడి 1,600 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌లో పెంచే చేపలు రుచిగా ఉంటాయనే నమ్మకంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ ఈసారి చేపల బరువు ఆశించిన స్థాయిలో పెరకగపోవడంతో మత్స్యకారుల్లో నిర్వేదం అలుముకోగా.. కొనుగోలుకు వస్తున్న ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
రెండు విడతల్లో పిల్లల విడుదల
గత ఏడాది అక్టోబర్ 19వ తేదీన 13లక్షల చేప పిల్లలను ప్రభుత్వం తరఫున రిజర్వాయర్‌లో వదిలారు. ఆతర్వాత మత్స్య సహకార సొసైటీ ద్వారా రూ.10 లక్షలు విలువైన మరో 14 లక్షల చేపపిల్లలను గత ఏడాది డిసెంబర్‌లో వదిలారు. సహజంగా చేపలు ఇప్పటికే కేజీకి పైగా బరువు పెరగాలి. ఇదే నమ్మకంతో గురువారం నుండి రిజర్వాయర్‌లో మత్స్యకారులు వేట ఆరంభంగా వారికి నిరాశే ఎదురైంది. ఏ చేప కూడా కేజీ బరువు దాటకపోగా.. పట్టాలు, వదిలేయాలా అన్న మీమాంస ఎదుర్కొన్నారు. రెండు విడతలుగా పోసిన చేప పిల్లలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఖాళీ వలలతో ఒడ్డుకు చేరారు.
ఎందుకు పెరగలేదంటే...
వైరా రిజర్వాయర్‌లో 27లక్షల చేప పిల్లలను వదిలినా అవి నాసిరకం కావడంతోనే ఆశించిన సైజ్‌కు చేరలేదని మత్స్యకారులు చెబుతున్నారు. బొచ్చ, రవ్వ, మృగాలతో పాటుగా రొయ్యపిల్లలు కూడా విడుదల చేశారు. అయితే, కొందరు గడువు రాకున్నా సన్నకన్నులు కలిగిన వలలతో చేపలు పట్టారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అధికారుల వాదనగా ఉంది. ఇరువర్గాల వాదనలు భిన్నంగా ఉన్నా, రిజర్వాయర్‌లో చేప పిల్లలు వదిలే సమయాన రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజులో ఉండగా, ప్రస్తుతం అర కేజీ నుంచి ముప్పావు కేజీ కూడా పెరగకపోవడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఎదురైనందున తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

చేప పెరగదు.. కడుపు నిండదు

చేప పెరగదు.. కడుపు నిండదు

చేప పెరగదు.. కడుపు నిండదు

చేప పెరగదు.. కడుపు నిండదు